Baahubali The Epic: బాహుబలికి పదేళ్లు.. రెండు భాగాలు కలిపి ఒకే సినిమా.. ఫ్యాన్స్ కి పండగే!

Baahubali The Epic: టాలీవుడ్ దర్శకద్రుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సెన్సేషనల్ సినిమా బాహుబలి. ఇందులో రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాయర్, రమ్య కృష్ణ లాంటి చాలామంది సెలబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను మాహిష్మతీ సామ్రాజ్యం లోకి తీసుకెళ్లి, అద్భుతమైన విజువల్స్‌ తో, ఉత్కంఠ భరితమైన కథనంతో కట్టిపడేసిన ఆ మహాకావ్యం విడుదలై చూస్తుండగానే 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా అభిమానులకు డైరెక్టర్ రాజమౌళి ఒక చక్కటి శుభవార్తను తెలిపారు. ఈ పదేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, రాజమౌళి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు. రెండు భాగాలనూ కలిపి, ఒకే పూర్తి స్థాయి సినిమాగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. బాహుబలి.. ఎన్నో ప్రయాణాల ఆరంభం. అనేక గుర్తులు. అంతులేని ప్రేరణ. దీనికి పదేళ్లు. ఈ ప్రత్యేకమైన ఘట్టాన్ని Baahubali: The Epic పేరుతో రెండు పార్టులను కలిపి తీసుకొస్తున్నాము.

2025 అక్టోబర్ 31న థియేటర్లలో మీ ముందుకు వస్తోంది అని రాజమౌళి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఆ సమయం కోసం వెయిటింగ్ ఇది నిజంగా శుభవార్త అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి 10 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ సినిమాలోని సన్నివేశాలు కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అంతటి చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీగా కలెక్షన్లను సాధించింది.