శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం ఇటీవలే హైకోర్టు తీర్పులపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కు పలు అంశాల విషయంలో హైకోర్టుతో మొట్టికాయలు పడటంతో స్పీకర్ సైతం కోర్టులపై తన అసంతృప్తిని మీడియా సాక్షిగా వ్యక్తం చేసారు. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం దేనికి? ప్రజా ప్రతినిధులు ఎందుకు? కోర్టుల నుంచే రాష్ర్ట ప్రజలని పరిపాలించొచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పొలిటికల్ కారికాడర్ లో పెద్ద చర్చకే దారి తీసాయి. శాసనసభాపతి స్థానంలో ఉన్న ఆయన నేరుగా రాజ్యాంగ బద్దమైన కోర్టుల గురించి విమర్శించడం సంచలనంగా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల మీడియా సైతం అవాక్కవాల్సిన సన్నివేశం ఎదురైంది.
అంతకు ముందు రోజే ప్రతిపక్ష పార్టీ టీడీపీపైనా తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీ విధి విధానాలను, పార్టీని తూర్పూరాబట్టారు. అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతోన్న సభాపతి అలా వ్యాఖ్యానించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని, హుందాగా వ్యవహరించాలని విమర్శలు ఎదుర్కున్నారు. అయితే తమ్మినేని ఫైరింగ్ వెనుక పెద్ద పొలిటికల్ గేమే ఉందని తాజాగా ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి రేసులో ఉండటమే తమ్మినేని ఆగ్రహానికి కారణమైందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పిల్లి సుభాస్ చంద్ర బోస్, మోపీదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడా పదవీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? అన్న దానిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే చాలా మంది సీనియన్ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో తమ్మినేని పేరు కూడా వినిపించింది. వాస్తవానికి తమ్మినేనికి జగన్ ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కాల్సింది. కానీ రాజకీయ సమీరణాల నేపథ్యంలో వీలు పడలేదు. దీంతో సభాపతిగా కూర్చొబెట్టి సంతృప్తి పరిచారు. కానీ ఇప్పుడు రెండు మంత్రి పదవులు ఖాళీ అవ్వడం… మళ్లీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే ఆపదవులు కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నారు. ఈనేపథ్యంలో తమ్మినేని తన మాటల తూటాల బలం చూపించుకునే ఆవశ్యకత కూడా ఏర్పడింది. అందుకే తమ్మినేని సభాపతిని అన్న విషయం సైతం విస్మరించి కోర్టులపై ఫైర్ అయ్యారంటూ సొంత పార్టీ లోనే గుసగుసకు దారి తీసింది.