డాక్టర్ సుధాకర్ -ప్రభుత్వం మధ్య వివాదం రాష్ర్టంలో ఏ స్థాయిలో సంచలనమైందో తెలిసిందే. ఈ వివాదం పోలీసులు..కోర్టులు దాటి సీబీఐ చేతిలోకి వెళ్లింది. ప్రస్తుతం సుధాకర్ మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. సుధాకర్ ని వెనుకుండి నడిపించేది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడని..ఆయన చెప్పినట్లే సుధాకర్ నడుచుకుంటున్నాడని వైకాపా నేతలు ఇప్పటికే ఆరోపించారు. అటు సామాన్య ప్రజానీకం ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది. ప్రస్తుతం సీబీఐ సీరియస్ గా ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుధాకర్ తాజాగా ఓ లేఖ రాయడం మరోసారి సంచలనంగా మారింది. అందులో తనికి వైద్యం అందిస్తున్న డాక్టర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు.
ఆసుపత్రి చీఫ్ డాక్టర్ రాధారిణికి రాసిన లేఖలో సుధాకర్ పలు అంశాల్ని ప్రస్తావించారు. చికిత్స లో భాగంగా తనకు ఇస్తోన్న మందులు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. రోజు రాత్రిపూట నాలుగ రకాల మాత్రలు ఇస్తున్నారని, దాంతో పాటు ఓ ఇంజెక్షన్ కూడా వేస్తున్నారు. ఆ సమయంలో గొంతు తడి ఆరిపోవడం, మూత్రం రాకపోవడం, కళ్లు మసకబారటం,ఆయాసం రావడం..తల బరువెక్కినట్లు ఉండటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మందులు మింగడంతో నోటి లోపల పుండ్లు రావడం…క్రమేణా ఇదే కొనసాగితే శ్వాస సంబంధ న్యూమోనియాకు దారి తీస్తుందని తెలిపారు.
సుధాకర్ కు వైద్యం చేస్తున్న డాక్టర్ రామిరెడ్డి పలు రకాల మానసిక రుగ్మతలకు వినియోగించే మందులు ఇస్తున్నట్లు ఆరోపించారు. దీంతో ఆ లేఖ మరోసారి తెలుగు రాష్ర్టాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సుధాకర్ శరీరంపై దెబ్బలు లేవని…కానీ మేజిస్ర్టేట్ ఇచ్చిన నివేదికలో శరీరంపై బలమైన గాయాలున్నట్లు రుజువైంది. దీంతో సుధాకర్ తాజా లేఖ ప్రభుత్వానికి తలబొబ్బి కట్టించడం ఖాయమనిపిస్తోంది. పైగా కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోన్న నేపథ్యంలో లేఖపై…డాక్టర్లు చేస్తోన్న వైద్యంపై కూడా ఆరాతీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.