రాజకీయాలకు, సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ సినీ నటులకు, రాజకీయ నాయకులకు మాత్రం సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సినిమా వాళ్లు తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉంటారు. మరోవైపు రాజకీయ నాయకులు తమ ఎన్నికల క్యాంపైన్ కి సినీ తారలను వాడుకుంటూ ఉంటారు. ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా నిలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా మంది సినీ తారలు ఎన్నికల సమయంలో ప్రచారాలు చేశారు. వారిలో మన కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం కూడా ఉన్నారు.
ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినా, కర్ణాటక రాజకీయాల్లో మాత్రం పాల్గొన్నారు. తన మిత్రుడి కోసం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ అక్కడ ఈసారి బ్రహ్మి మంత్రం పనిచేయలేదు.
ఇంతకీ మ్యాటరేంటంటే..ఇటీవల కర్ణాటక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. అయితే, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ కి కన్నడ ప్రజలు జై కొట్టారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలో.. ఓ బీజేపీ అభ్యర్థికి సినీ నటుడు బ్రహ్మానందం ప్రచారం చేశారు.
బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరపున నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మి ప్రచారం చేశారు. అయితే అక్కడ సుధాకర్ ఓడిపోయారు.11,130 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు. ఈశ్వర్ కు 69,008 ఓట్లు రాగా, సుధాకర్ కు 57878 ఓట్లు పడ్డాయి. ఇక జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ 13,300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఏపీకి ఆనుకుని ఉన్న చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికం. ఈ క్రమంలో గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. అప్పుడు సుధాకర్ గెలుపొందారు. మంత్రి పదవికూడా దక్కింది. అందుకే ఈ సారి కూడా బ్రహ్మిని స్పెషల్ గా ఆహ్వానించి ఎన్నికల ప్రచారం చేయించారు. కానీ ఆయన ఓటమి చెందారు. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఆయన ఓటమికి కారణమైంది.