ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కీలక మార్పులు జరిగాయి. సీఎంఓ కార్యాలయంలో భారీగా ప్రక్షాళన జరిగింది. దీంతో జగన్ కి సన్నిహితులుగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి అజయ్ కల్లంకి కళ్లెం పడటం రాజకీయంగా చర్చకొచ్చింది. సీఎం కార్యాలయం బాధ్యతల నుంచి అజయ్ కల్లం, పీవీ రమేష్, జే మురళీలను తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ముగ్గరి బాధ్యతల్ని ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాంపులు జరిగాయి. ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయశాఖ, కేంద్ర రాష్ర్ట సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్ చేరాయి. సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో రవాణా, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విధ్యామండలి, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ చేరాయి.
ఇక ధనుంజయ్ రెడ్డి పరిధిలో జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ ఉన్నాయి. అయితే అజయ్ కల్లంకు కళ్లెం పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అజయ్ ఎన్నికలు ఆరు నెలలు ముందు నుంచి జగన్ సన్నిహితుడిగా మారారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కీలక అధికారిగా అజయ్ పనిచేసారు. దీంతో అక్కడ లోగుట్టు పై ఆయనకు బాగా పట్టు ఉంది. అవన్నీ ఎన్నికలకు ముందు జగన్ విమర్శనాస్ర్తాలుగా మలుచుకుని చంద్రబాబు పై ప్రయోగించారు. ఇక జగన్ అధికారంలోకి రాగానే అజయ్ కల్లం ని జ సీఎంకి ప్రత్యేక కార్యదర్శిగా జగన్ పక్కనే పెట్టుకున్నారు.
లక్షల్లో జీతాలిచ్చి కొన్ని శాఖలపై ప్రత్యేక అధికారం కల్పించారు. అయితే తర్వాత కాలంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో అజయ్ కల్లం స్వీయా తప్పులు కూడా తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా అర్ధిక వ్యవహారాల్లో కల్లం తల దూర్చారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఆయన్ని దూరం పెట్టడం జరిగింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. అలా ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. చివరికిలా పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి హైకోర్టులో భంగపాటు ఎదురవ్వడం, ప్రతీ తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా మారడం వెనుక ప్రతిపక్షానికి లీకులందుతున్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ కారణాలు కూడా జగన్ పరిగణలోకి తీసుకుని ప్రక్షాళన చేసినట్లు విశ్వసనీయ సమాచారం.