ఏపీలో లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను..అందులో ఉన్న పార్లమెంట్ స్థానాల ప్రాతిపదికన విభజిస్తే మొత్తం 25 జిల్లాలు అవుతాయి. జిల్లాలు ఎక్కువగా ఉంటే పాలన సులభంగా ఉంటుందని, ఆయా ప్రాంతాల అభివృద్ధి కూడా బాగుంటుందని జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రచార సమయంలోనూ ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఏడాది పాలన పూర్తైన సందర్భంగా జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై పనులను ముమ్మరం చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లో ఒక జిల్లా కు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసారు. తమ శ్రీకాకుళం జిల్లాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో విడదీయోద్దని, మిగతా జిల్లాల సంగతి మీ ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. జిల్లా విభజనపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ధర్మాన తెలిపారు. శ్రీకాకుళంను విభజిస్తే రాజకీయంగా తమ పార్టీ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. విభజన చేసే ముందు శ్రీకాకుళం జిల్లాల ప్రజల అభిప్రాయలు ప్రభుత్వం తీసుకోవాలని సీఎం జగన్ కు ధర్మాన విజ్ఞప్తి చేసారు.
దీంతో ధర్మాన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ధర్మాన చాలా సీనియర్ నేత. గతంలో పలు పార్టీలో కీలక పదవులు చేపట్టారు. శ్రీకాకుళంలో పట్టున్న నాయకుడు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ధర్మాన వ్యాఖ్యలు రాజకీయ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తలు మొదలు పెట్టిన నేపథ్యంలో ధర్మన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జిల్లాల ఏర్పాటు అనేది ప్రభుత్వంలో ఎప్పటి నుంచో నలుగుతోన్న అంశం. మరి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ధర్మాన ఇప్పుడు వద్దంటూ తెరపైకి రావడం సంచలనంగా మారింది.