వైసీపీ కేడర్, నేతల నుండి రక్షణ కల్పించమని ఎస్పీని కోరిన  రాఘురామరాజు 

Raghurama Krishnama Raju
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా తయారయ్యారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.  పలు కీలక విషయాల్లో పార్టీ నేతల మీద విమర్శలు గుప్పించిన ఆయన ముఖ్యమంత్రిని కలిసే అవకాశం తనకు ఇవ్వట్లేదని, సీఎం చుట్టూ కోటరీ ఏర్పడిందని అన్నారు.  దీంతో వైసీపీ నేతలు ఆయన మీదకి ఆయన సామాజిక వర్గానికి చెందిన నేత, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును ప్రయోగించారు.  ప్రసాదరాజు జగన్ దయతో రాఘురామకృష్ణరాజు పదవులు పొందారని అన్నారు.  దీంతో వ్యవహారం మరింత ముదిరింది.  తాను సొంత ఇమేజ్ మీద గెలిచానన్న ఎంపీ తమ బొమ్మ మీదే తన నియోజకవర్గ ఎమ్మెల్యేలు గెలిచారని మాట్లాడారు.
 
 
తానూ రాజీనామా చేస్తానని, దమ్ముంటే తన నియోజకవర్గ పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేసి పోటీకి దిగాలని సవాల్ విసిరారు.  దీంతో ఎమ్మెల్యేలకు, ఆయనకు మధ్య వాతావరణం పూర్తిగా చెడింది.  ఎమ్మెల్యేల క్యాడర్లు ఎంపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని హెచ్చరికలు చేశారు.  దీంతో ఎంపీ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు తన దిష్టిబొమ్మలను దహనం చేశారని, అలాగే కోవిడ్ నిబంధనలను ఉల్లఘించారని ఉండి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, ఆచంట పోలీస్ స్టేషన్లలో పిర్యాధులు చేశారు.  అయినా ఎలాంటి చర్యలూ కనబడలేదు. 
 
 
దీంతో ఆయన ఈరోజు నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా లేఖ రాశారు.  ఆ లేఖలో రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దగ్దం చేయడంతో పాటు తీవ్రస్థాయిలో దూషించారని, ఎంపీ దిష్టిబొమ్మ దగ్దం చేసిన వైసీపీ కార్యకర్తలు, నేతలపై చర్యలు తీసుకోవాలని ఉండి, ఆచంట, ఆకివీడు, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వివరిస్తూ జిల్లాలో ఎంపీ పర్యటించే సమయంలో ఆయనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.  ఇలా సొంత పార్టీ కేడర్, నేతల నుండే తనకు హాని ఉందని రాఘురామరాజు పోలీసుల్ని రక్షణ కోరడం 
వివాదాన్ని మరింత పెద్దది చేసింది.