దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి జులై 8 బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరుపును సీఎంగా ఖ్యాతికెక్కిన వైఎస్సార్ సేవల్ని ఆ పార్టీ నాయకులంతా నిన్న గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ అధికారంలో ఉన్నంత కాలం ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. ఇక వైఎస్సార్ సొంత జిల్లా కడపలో ప్రత్యేకంగా వైఎస్సార్ విగ్రహాలు వెలిసాయి. కడప కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎన్ తులసి రెడ్డి వైఎస్ సేవల్ని గొప్పగా వర్ణిస్తూనే ఆయన తనయుడు, యంగ్ సీఎం జగన్ తీరును తూర్పురా బట్టారు.
రాజశేఖర్ రెడ్డి అసలైన కాంగ్రెస్ వాది అన్నారు. కానీ ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ మాత్రం తండ్రి ఆశయాలను తుంగలోకి తొక్కుతున్నారని మండిపడ్డారు. జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో గొప్పదన్నారు. ఎమ్మెల్యే గా ప్రారంభమై, ఎంపీగా, పీసీసీ అద్యక్షుడిగా, మంత్రిగా, గొప్ప నాయకుడిగా ఎదిగారన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వైఎస్సార్ కి ఎనలేని గౌరవాన్ని ఇచ్చాయన్నారు. ఆయన కూడా పార్టీ కి ఎప్పుడు విధేయుడిగానే నడుచుకున్నారన్నారు. కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ కు, సోనియాకు వెన్ను పోటుదారుడని మండిపడ్డారు.
యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టి, బద్ద శత్రువుగా భావించే బీజేపీకి మిత్ర పక్షంగా మారి, కాంగ్రెస్ పథకాలను పేర్లు మార్చి తన పథకాలుగా చూపుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ మరణానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణమంటూ ఆరోపించి, ఇప్పుడు అదే అంబానీని ఏపీకి ఎర్ర తివాచీ వేసి మరీ ఆహ్వానిస్తున్నారన్నారు. ఆయన్ని మళ్లీ రాజ్యసభకు పంపించిన ఘనత జగన్ కే దక్కుతుందని ధ్వజమెత్తారు. జగన్ చేస్తోన్న పనులు చూస్తుంటే వైఎస్సార్ ఆశయాలకు తనయుడిగా వెన్నుపోటు పొడిచినట్లు ఉందని మండిపడ్డారు. సొంత చిన్నాన్న వివేకానందారెడ్డి ఇంట్లోనే హత్యకు గురైతే పట్టించుకోలేదని ఆరోపించారు.