ఉక్కు నగరం విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడ వరుసగా భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రశాంతంగా ఉండే విశాఖ గత మూడు నెలలుగా భయం గుప్పిట్లో ఉంది. మే, జూన్, జులై నెలల్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎల్ జీ పాలిమర్స్ ఘటన, సాయినార్ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలిపోవడం , హెచ్ పీసీఎల్ లో మంటలు వ్యాపించడం, నిన్న రాంకీ ఫార్మాకి చెందిన సాల్వెం ట్ లో మరో రియాక్టర్ సహా రసాయనాలు నిండుగా ఉన్న డ్రమ్ములు పేలిపోవడం వంటి ఘటనలు విశాఖ వాసుల్ని బెంబేలెత్తించాయి. ఇలా వరుసగా ఘటనలు చోటు చేసుకోవడం పై పలు అనుమాలు వ్యక్తం అయ్యాయి.
వైకాపా స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ టీడీపీ పార్టీ పై ఇప్పటికే అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా స్వాలెంట్ ప్లాంట్ ని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ ప్రమాదాలు వెనుక కుట్రలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేసారు. లాక్ డౌన్ కారణంగా గ్యాప్ రావడంతో విధి నిర్వహణలో లోపాలు కారణంగా రియాక్టర్లు పేలిపోతున్నాయా? లేక కుట్రలు చేసి పేల్చేస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేసారు. ఈ ఘటనలన్నింటిపై పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేపడుతామని..కుట్ర కోణం ఉంటే మాత్రం ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనలో మరణించిన వారికి 50 లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 20 లక్షలు అందిస్తామని తెలిపారు. ఫార్మా కంపెనీలన్నీ విధిగా నిబంధనలన్నిటిని పాటించాలని సూచించారు. కంపెనీకి సంబంధించిన అనుమతు లు..కాలుష్య కారకాలకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని…ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కారకులైన వారిని అరెస్ట్ చేయిస్తామని తెలిపారు.