శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో వైకాపాలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. ఇటీవలే వైకాపా నేతలు స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు బాహాబాహీకి దిగారు. తమ్మినేని ముందే ఒక్కర్నిఒకరు దుర్భాషలాడుకుని కాలర్లు పట్టుకుని తన్నుకున్నారు. ఈ ఘటన సరిగ్గా పొందరు వ్యవసాయ మార్కెట్ లో చోటు చేసుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమ్మినేని వెళ్లినప్పుడు జరిగిన ఘటన ఇది. చివరికి తమ్మినేని కల్పించుకుని వివాదానికి సర్ది చెప్పారు. దీంతో శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తాజాగా అదే మండలంలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది.
అయితే ఈసారి తమ్మినేని సీతారం స్పాట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కొట్టుకున్నారు. ఈ రోజు తమ్మినేని రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసి వెళ్లిపోయిన అనంతరం దాడి చేసుకున్నారు. ఒకే పార్టికి చెందిన ఇరు వర్గాల వారు రోడ్లపైకి వచ్చి చొక్కాలు చించుకుని దొర్లించుకుని మరీ కొట్టుకున్నారు. గోళ్లతో గుండెలపై రక్కుకుని…చేతికి దొరికిన దానితో కొట్టుకుని చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. చివరికి పలవురు నాయకులు నచ్చజెప్పడంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి. ఈ విషయం తమ్మినేనికి తెలియడంతో వెంటనే ఆయన స్థానిక నాయకులకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
సొంత పార్టీ వాళ్లే ఇలా తన్నుకోవడంపై పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలు మనసులో పెట్టుకునే ఇలా వీధిపోరాటానికి దిగినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని చెబుతున్నా ఇరు వర్గాలు వినిపించుకోవడం లేదు. ఈ వివాదం సద్దుమణగాలంటే తమ్మినేని సీతారం ఇరు వర్గాలను కూర్చొబెట్టి మాట్లాడాలని కార్యకర్తలు అంటున్నారు. ఇలాంటి వివాదాలకు ఇప్పుడే పరిష్కారం చూపించకపోతే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల సమయానికి పతాక స్థాయికి చేరుకుంటాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.