ప్రస్తుత ప్రపంచం కరోనా వైరస్ తో పోరాటం చేస్తుంది. మందు లేని కొవిడ్ జబ్బుకు మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లు తుందా? అన్న అనుమానంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజు రోజుకి కరోనా సమీకరణాలు మారిపోతున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లపైనే కాకుండా కరోనా రూపం మార్చుకుంటూ మృత్యు గడియలు మ్రోగిస్తోంది. భారత్ లో పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగానే ఉంది. కేసుల సంఖ్యలో భారత్ మూడవ స్థానానికి ఎగబాకింది. మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆరంభంలో అన్ని దేశాలకు భారత్ వైరస్ ని కట్టడి చేయడంలో ఆదర్శంగా నిలిచిందని దక్కించుకున్న ప్రశంసని చివరికి చేరుపుకోక తప్పలేదు.
ఇంకా భారత్ లో సమూహ వ్యాప్తి మొదలవ్వలేదు. అది మొదలైతే పరిస్థితి ఊహించని విధంగా ఉంటుందని ఇప్పటికే సర్వేలు హెచ్చరించాయి. వైరస్ సోకితే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది భారత ప్రజలకు బాగా అర్ధమైన సమయమిది. ఇప్పుడు వైరస్ పెరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జీ-4, బ్యుబోనిక్ అనే రెండు కొత్త వైరస్ లతోనూ మానవాళికి ముప్పు పొంచి ఉందని ప్రచారం సాగుతోంది. ఇంకా ఆ వైరస్ ల వ్యాప్తి జరగలేదు. భవిష్యత్ లో ఆ రెండు వైరస్ లతోనూ ప్రపంచ దేశాలకు ప్రమాదం పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కజకిస్థాన్ లో మరో కొత్త వైరస్ అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది.
అది కరోనా కంటే భయంకరమైన మరో వైరస్ లా విజృంభిస్తోందని అంటున్నారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తు తెలియని ఈ వైరస్ తో మరణించారని చైనా పేర్కొంది. అయితే ఇది ఆరోపణ మాత్రమేనని కిజికిస్తాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కజకిస్థాన్ లో న్యూమోనియా కలిగిస్తున్న ఆ వైరస్ బహుశా కరోనా? అయి ఉంటుందని సందేహం వ్యక్తం చేసింది. దీంతో ఇది కరోనా వైరస్సా? కొత్త వైరస్సా? అన్న సందేహాలు బలపడుతున్నాయి. చైనా ఇప్పటికే ఈ వైరస్ పై అప్రమత్తమైంది. తమ దేశ పౌరుల్ని ఆదేశంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేసింది.