ఈ ఎస్ ఐ స్కామ్ లో కొత్త ట్విస్ట్ బయటపడిన సంగతి తెలిసిందే. 150 కోట్ల స్కామ్ లో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. కార్మిక శాఖ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కు అప్పట్లో పీఎస్ గా పనిచేసిన మురళీ మోహన్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మురళీ మోహన్ ప్రస్తుతం సచివాలయంలోని అడ్మినిస్ర్టేటివ్ విభాగంలో పనిచేస్తున్నాడు. దీంతో నేరుగా సచివాలయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మురళీ మోహన్ ని అక్కడే ఓ రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. మురళీ మోహన్ నుంచి కీలక సమాచారం రాబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నేడు ఏసీబీ న్యాయ స్థానం ముందు మురళీ మోహన్ ని హాజరు పరచనున్నారు.
అయితే మురళీ మోహన్ అరెస్ట్ ను ముందుగానే తెలుసుకున్న పితాని కుమారుడు సురేష్ పరారయ్యాడు. దీంతో సురేష్ కోసం ఏసీబీ సహా పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రాష్ర్టాలు దాటిపోకుండా అన్ని పోలీస్టేషన్లను అలెర్టు చేసారు. రాష్ర్టం సరిహద్దు దాటకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఈ రోజు సాయంత్రానికి సురేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం ఖాయమని అధికారులు ధీమా వ్యక్తం చేసారు. ఈ వ్యవహారానికి ముందు ఇరువురు హైకోర్టులో మందుస్తు బెయిల్ కు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటీషన్ ఆర్డర్ ను కోర్టు రిజర్వ్ లో పెట్టింది.
ఈ లోగా సురేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో సురేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో పరారయ్యాడు. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు అరెస్ట్ అయ్యారు. వీరి రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో వారి రిమాండ్ ను న్యాయమూర్తి మరో 14 రోజులు పొడిగించారు. అచ్చెన్నను అధికారులు విచారించినప్పటికీ ఆయన సరైనా సమాధానాలు చెప్పలేదు. తాజా పరిస్థితుల నే పథ్యంలో ఆయన్ని మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.