ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేత వివాదం ఉధృతంగా మారిన నేపథ్యంలో, ఎగ్జిబిటర్ సత్యనారాయణ మరోసారి హాట్‌టాపిక్ అయ్యారు. జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ, తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగా స్పందించారు. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా ఎదురుదాడికి దిగారు. “పవన్ కళ్యాణ్ నా దేవుడు. ఆయన సినిమాకు అడ్డు పడాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు,” అంటూ తన వెర్షన్‌ను మీడియా ముందు ఉంచారు.
సత్యనారాయణ వివరించిన విధంగా, థియేటర్ల బంద్ నిర్ణయం ఏప్రిల్ 24న తీసుకున్నారట. కానీ హరి హర వీరమల్లు విడుదల తేదీ మే 12న ఉన్నందున, ఈ బంద్ నిర్ణయం పవన్ కళ్యాణ్ సినిమాకు వ్యతిరేకంగా తీసుకున్నదికాదని స్పష్టం చేశారు. దిల్ రాజు తప్పుడు ప్రచారానికి తెరలేపారని, దీనిని రాజకీయ కుట్రగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తన వద్ద ఉన్న ఆధారాలతో దిల్ రాజు తప్పుబడతారని ధీమా వ్యక్తం చేశారు.
పవన్‌తో తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేస్తూ, గతంలో తనతో కలిసి రాజకీయంగా పని చేశానని గుర్తు చేశారు. “వెన్నుపోటు వేసే పరిస్థితి ఎప్పుడూ రాదు, నేను ఒక్కసారి మిత్రుడినైతే జీవితాంతం మిత్రుడినే,” అంటూ వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తలు కూడా తనకు మద్దతుగా ఉన్నారని చెప్పిన సత్యనారాయణ, ఈ వివాదం సినీ పరిశ్రమలో అనవసర కల్లోలం తెచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరి దృష్టి దిల్ రాజు తదుపరి స్పందనపై ఉంది. ఒకవైపు నిర్మాతలు, మరోవైపు ఎగ్జిబిటర్లు.. మధ్యలో పవన్ కళ్యాణ్ చిత్రం. ఈ వివాదానికి ఎటువైపు తీర్పు పడుతుందో చూడాల్సిందే. కానీ పరిశ్రమ మొత్తానికి స్పష్టత అవసరం తప్పదు.

