పులిచింతల గేటు ఎపిసోడ్: వైఎస్సార్సీపీ సెల్ఫ్ గోల్

పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి కొట్టుకుపోయిన గేటు వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. వైఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యింది.. దాదాపుగా అన్ని పనులూ వైఎస్ హయాంలోనే ఓ కొలిక్కి వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి హోదాలో జాతికి అంకితమిచ్చారనుకోండి.. అది వేరే సంగతి. గేటు ఎందుకు కొట్టుకుపోయింది.? అన్నదానిపై విచారణ జరగాల్సి వుంది. అయితే, పులిచింతల గేటు కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబేనని వైసీపీ ఆరోపించి బొక్కబోర్లా పడింది. నిజానికి, ఇలాంటి విషయాల్లో వైసీపీ ఆచి తూచి వ్యవహరించాల్సి వుంది. పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి 33 గేట్లు అవసరం కాగా, 29 గేట్లతోనే సరిపెట్టేశారు. పియర్ల మధ్య గ్యాప్ విషయంలోనూ అవకతవకలు జరిగాయనీ, పియర్ల వెడల్పు విషయంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న విమర్శలున్నాయి.

కాంక్రటీటు డ్యామ్ సైజు తగ్గించి, మట్టితో ఎక్కువ భాగం నింపేశారన్న విమర్శలూ ప్రాజెక్టు నిర్మాణంలో వినిపించాయి. అవెంత నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆనాటి ఆ కథనాలకు ఇప్పుడు పాపులారిటీ పెరిగింది. ప్రాజెక్టుల్లో అవినీతి అన్నది ఓపెన్ సీక్రెట్. ఏ పార్టీ అధికారంలో వున్నా, దోపిడీ సర్వసాధారణం. అయినవారికి కాంట్రాక్టులు ఇచ్చుకోవడం, కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడం.. అనాదిగా వస్తున్నదే. అయితే, ప్రాజెక్టు నిర్మాణంలో ఏ కాంట్రాక్టు సంస్థ అయినా రాజీపడుతుందా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఖర్చు పెంచేసుకుని, అదనంగా సొమ్ములు క్యాష్ చేసుకోవడంలో కాంట్రాక్టు సంస్థలన్నటిదీ ఒకటే తీరు.. ఇది బహిరంగ రహస్యం. ఇక, పులిచింతల వ్యవహారంలో పాత లెక్కలనీ బయటపడుతోంటే, పరువు పోయేది వైసీపీదే. అందుకేనేమో, మంత్రి పేర్ని నాని, రాజకీయాలొద్దు.. అంటున్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ కోణంలో చూడొద్దనీ చెబుతున్నారు పేర్ని నాని. బహుశా వైసీపీకి తత్వం బోధపడిందేమో గేటు వ్యవహారంలో.