పీకే సహాయం కోరుతున్న వైఎస్ జగన్ ?

2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర ఎలాంటిదో అందరికీ తెలుసు.  భారీ మొత్తం చెల్లించి వైఎస్ జగన్ ప్రశాంత్ కిశోర్ యొక్క ఐప్యాక్ సంస్థ సేవలను వినియోగించుకున్నారు.  ప్రజలను వైకాపా వైపు తిప్పడంలో, ఎన్నికల కోసం అన్ని మాధ్యమాల్లో  పార్టీకి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడంలో ప్రశాంత్ కిశోర్ పనితనం అందరికీ తెలుసు.  అందుకే మరోసారి పీకే సహాయం కోరుతున్నారు వైఎస్ జగన్.  ఈసారి ఏకంగా ఆయన్ను ప్రభుత్వంలోకి ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు.  వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండటం.  
 
ఈ వారధి ప్రభుత్వ పథకాల లబ్డిని మాత్రమే కాదు వైకాపాను కూడా ఓటర్లకు దగ్గర చేసే పనిని నిత్యం చేస్తూ ఉండాలి.  అప్పుడే కింది స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటుందనేది జగన్ ఉద్దేశ్యం.  ఈ పనిని వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించేందుకు వారికి మెరుగైన శిక్షణ అవసరమని సీఎం భావిస్తున్నారు.  అందుకే పీకే బృందాన్ని రంగంలోకి దింపుతున్నట్టు ప్రముఖ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  ఈసారి పీకే టీమ్ నుండి ఒక వ్యక్తి దీర్ఘకాలం ఈ కొత్త ప్లాన్ కోసం పనిచేసేలా నియమితులవుతారట. 
 
ఆయన సారథ్యంలో ఫీల్డ్ ఆర్గనైజింగ్ ఏజెన్సీ ఒకటి ఏర్పాటవుతుంది.  ఈ ఏజెన్సీ తరపున ప్రతి మండలంలో ఒక మండల స్థాయి అధికారి ఒకరు ఉంటారు.  ఈ మండల స్థాయి అధికారులు వాలంటీర్ల పనితీరును పరిశీలిస్తుంటారు.  అలాగే వారికి వైకాపా గురించి ప్రజలకు చెప్పడం, ఎప్పటికప్పుడు మండలంలోని ప్రజాభిప్రాయం ద్వారా రాజకీయ పరిస్థితులను అంచనా వేసి పై స్థాయి అధికారులకు చెప్పడం, వారి శిక్షణలో మెళకువలన్నీ నేర్చుకుని పని చేయడం చేయాల్సి ఉంటుంది.  మొత్తం మీద వైఎస్ జగన్ నాలుగేళ్ల ముందు నుండే ఎన్నికలకి సన్నద్దమవుతున్నారన్నమాట.