యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యొక్క వాడుక నామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు వాడుకుంటున్నారు, ఆ పేరు మీద సర్వహక్కులు మావి, వారి పార్టీ గుర్తింపును రద్దు చేయండి అంటూ
అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. లెటర్ హెడ్ల మీద, అన్ని పబ్లిక్ మీటింగుల్లో, పార్టీ అధికారిక కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుతున్నారని మహబూబ్ భాషా పిర్యాధులో పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును ఎక్కడా వాడకూడదని జగన్ బృందానికి ఎన్నికల సంఘం తెలిపింది. మధ్యలో కూడా ఒకసారి మహబూబ్ బాషా జగన్ తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకుంటున్నారని, ఆ పేరు మీద సర్వ హక్కులు తనవని, ఇక మీదట అలా వాడకుండా హెచ్చరించాలని ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళారు. అప్పుడు ఈసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడకూడదని తెలిపింది. తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ పడటంతో సమస్య మరింత జటిలమైంది.
మహబూబ్ భాషా పిటిషన్ను విచారించిన హైకోర్టుకౌంటర్ దాఖలు చేయాలని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడటంపై జగన్ పార్టీ తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు ఈ పేరుపై ఇంత వివాదం రేగడానికి వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణరాజుకి అధిష్టానానికి మధ్యన తలెత్తిన సమస్యలే కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో విజయసాయిరెడ్డి పంపిన షోకాజ్ నోటీసుల వల్లే రఘురామరాజు పార్టీ అసలు పేరేమిటనే ప్రశ్నను లెవనెత్తారు.