శివాజీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఆ సినిమాలో కన్నా వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో భాగా ఫేమస్ అయిపోయింది. శివాజీ సినిమాలో ఓ ఫైట్ సీన్ లో భాగంగా పందులే గుంపుగా వస్తాయి…సింహం సింగిల్ గా వస్తుందని ఓ డైలాగు ఉంటుంది. ఇదే డైలాగ్ ను వైకాపా నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు రియల్ లైఫ్ లో పందులే గుంపుగా వస్తాయని వాడేసి అడ్డంగా బుక్కయ్యారు. జగన్ సర్కార్ తో తలెత్తిన వివాదంలో భాగంగా ఆ పార్టీ నేతల్ని, ఎమ్మెల్యేల్ని కించపరచేలా రఘురాం అలా నోరు జారారన్నది వైకాపా నేతల ఆరోపణ. జగన్ ఏడాది పాలన, ప్రభుత్వ పనితీరును ఉద్దేశించి రఘురాం ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే ఎంపీకు అంతే ధీటుగా రిప్లై ఇచ్చారు. అయితే ఎంపీ వాడిన పందులు అన్న పదాన్ని మాత్రం సదరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే రఘురాంపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. దీంతో రఘురాంపై ఆచంట నియోజకవర్గం పోడూరు లో కేసు నమోదైంది. ఆ వెంటనే మరో ఇద్దరు ఎమ్మెల్యే లు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మదునూరి ప్రసాదరాజు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
తమని జంతువులతోనూ, అందులోనూ పందులతోనూ పోల్చారని, ఇది తమ ప్రతిష్టకు భంగం కలిగినట్లు గా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరుగా తణుకు, నరసాపురం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసారు. ముందుగా మంత్రి, ఆ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేసులు వేయడం చూస్తుంటే ఈ పరంపర ఇక్కడితో ఆగేలా లేదు. వైకాపాకు చెందిన మిగతా ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి ఎంపీ ఇరుక్కుపోయారే.