నిర్భయ.! దిశ.! దశ, దిశ లేని న్యాయం.!

Disha

Disha : దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే.. తెలంగాణలో దిశ ఘటన జరిగింది. చెప్పుకోడానికి ఈ రెండూ ప్రముఖమైన ‘కేసులు’. ఔను, దేశంలో నిత్యం పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వెలుగులోకి వచ్చేవి కొన్నే.. వెలుగులోకి రానివి ఎన్నో.!

దిశ ఘటన గురించి ఇప్పుడు మళ్ళీ చర్చ జరుగుతోంది. కారణం, దిశ ఘటనలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్ బూటకమని తేలడం. దిశ ఘటనలో నిందితుల్ని పోలీసులు కాల్చి చంపారు.. పారిపోయేందుకు ప్రయత్నించి, తమ మీద దాడికి యత్నించడంతో నిందితుల్ని కాల్చి చంపామని పోలీసులు పేర్కొన్నారు అప్పట్లో.

కానీ, అత్యంత పాశవికంగా దిశపై చేసిన హత్యాచారానికిగాను, తక్షణ న్యాయం పోలీసులు చేశారని అప్పట్లో దేశమంతా అభినందనలు తెలిపింది తెలంగాణ పోలీస్‌కి. నిర్భయ, దిశ లాంటి ఘటనల్లో తక్షణ న్యాయం జరగాల్సిందే. కానీ, అది న్యాయమేనా.? అన్నదే చర్చ.

ఓ యువతిని అతి కిరాతకంగా చంపేసే నరరూప రాక్షకులకు మానవ హక్కులేముంటాయ్.? అన్నది చాలా కేసుల్లో వింటుంటాం. అది నిజం కూడా. కానీ, ఆయా కేసుల్లో దోషుల్ని తప్పించేందుకు అమాయకుల్ని బలిచేస్తుంటారన్న ఆరోపణలు ఈనాటివి కావు.

నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా, దిశ ఘటన ఎందుకు జరిగింది.? ఇక్కడ రాజకీయ వైఫల్యం సుస్పష్టం. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ రాజకీయాల్లో నేరచరితులు వుండకూడదు. అప్పుడే, నిర్భయ చట్టం అయినా.. ఇంకేదైనా సత్ఫలితాలనిస్తుంది. దేశంలో నేరస్తుల్ని శిక్షించేందుకు చట్టాలు లేక కాదు, నేరస్తులు తప్పించుకోవడానికి ‘అవకాశాలు’ ఎక్కువైపోతున్నాయ్.. అదే అతి పెద్ద సమస్య. అందుకే, న్యాయానికి దశ, దిశ లేకుండా పోతోంది.