నిమ్మగడ్డ కేసులో ఏపీ సర్కారుకు మరో వైఫల్యం 

నిమ్మగడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల  కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనీయకూడదని ఏపీ సర్కార్ బలంగా సంకల్పించుకున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ ప్రయత్నంలో వారికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.  హైకోర్టు నిమ్మగడ్డను పదవీ బాధ్యతల నుండి తొలగిస్తూ జారీచేసిన ఆర్డినెన్సును ఏపీ హైకోర్టు రద్దు చేసి నిమ్మగడ్డను కమిషనర్‌గా పునర్ నియమించాలని తీర్పు చెప్పింది.  అయినా ఏపీ సర్కార్ వెనక్కు తగ్గకుండా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్ళింది.  విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వలేమని తెలిపింది. 
 
దీనిపై ప్రతివాదులకు నోటీసులు పంపిన సుప్రీం కోర్టు రెండు వారాల తర్వాత వాదనలు విని తీర్పు చెబుతాం అంది.  కానీ అంతవరకు ఆగలేకపోయిన ఏపీ సర్కార్ ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శితోనే స్టే కోరుతూ పిటిషన్ వేయించింది.  ఈ పిటిషన్ మీద ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది.  ఈ అంశం మీద ఇదివరకే విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామన్న ధర్మాసనం ఈ పిటిషన్ మీద కూడా నోటీసులు జారీ చేస్తామని తెలిపింది.  
 
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.  కొత్తగా దాఖలైన పిటిషన్లను గత పిటిసన్లతో ట్యాగ్‌ చేసింది.  దీంతో రెండోసారి స్టే కోసం ప్రయత్నించిన ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు.  కొత్త ప్రయత్నంలో మళ్లీ పాత తీర్పే రిపీట్ కావడంతో నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలనే ఆలోచనలో పడింది ప్రభుత్వ లీగల్ టీమ్.  ఇకపోతే ప్రతివాదుల నుండి వివరణలు వచ్చాక వచ్చే వారం విచారణ జరిగే అవకాశముంది.  ఈ విచారణ అనంతరం మళ్లీ కేసు వాయిదాపడే సూచనలే కనిపిస్తున్నాయి.