దివంగత ముఖ్యమంత్రి వెఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా మహానేతపై ఆయన సతీమణి విజయమ్మ `నాలో నాతో వైఎస్సార్` అనే పుస్తకాని రచించి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో వైఎస్సార్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి. వైఎస్సార్ తో విజయమ్మకున్న ప్రతి జ్ఞాపకాన్ని పుస్తకంలో పొందుపరిచారు. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను విజయమ్మ `నాలో నాతో వైఎస్సార్` లో డిస్కస్ చేసారు. దీంతో ఈ పుస్తకంపై పాఠకులు అంతే ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ బుక్ ఇంకా అన్ని బుక్ స్టాల్స్ లోకి అందుబాటులోకి రాలేదు. దీంతో పుస్తకం పేరు చెప్పి కొంత మంది ఆన్ లైన్ లో వ్యాపారం మొదలు పెట్టేసారు.
ఈ పుస్తకం పేరు చెప్పి ఇవే ఆ బుక్ పీడీపీఎఫ్ ఫైల్స్ అంటూ అమ్మేస్తున్నారు. తాజాగా ఈ విషయం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. కేవలం ఎమ్మెస్కే పబ్లికేషన్స్ అచ్చు వేసిన పుస్తకం మాత్రమే కొనుగోలు చేయండని సూచించారు. అలాగే ఆన్ లైన్ బుక్ పేరుతో వ్యాపారం చేసే వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుక్ లో అంశాలు..సోషల్ మీడియాలో పీడీఎఫ్ ల రూపంలో వైరల్ అవుతోన్న అంశాలు వేరుగా ఉన్నాయని సుబ్బారెడ్డి తెలిపారు. కొంత మంది దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే రాష్ర్ట డీజీపీని కలిసి ఫిర్యాదు చేసామన్నారు. వైఎస్సార్ అభిమానులు, వైకాపా కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గ్రహించాలని…పుస్తకం గురించి తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం టీడీపీపైనా పలువురు వైకాపా నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైకాపా గురించి నెగిటివ్ గా ప్రచారం చేసే టీడీపీ వింగ్ ఒకటి ఎప్పుడు యాక్టివ్ లో ఉంటుంది. అందులో వైకాపా సంక్షేమ పథకాల గురించి తప్పుడుగా ప్రచారం చేయడమే పని. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలపైనా వైకాపా నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.