దుబ్బాక ఉప ఎన్నికని హరీష్ రావు చేతుల్లో పెట్టేశారు.. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల బాధ్యతల్ని కేటీఆర్ చూసుకున్నారు.. రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ తనదైన వ్యూహాల్ని అమలు చేశారు. ‘చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన’ గులాబీ పార్టీ గెలిచిందన్న విమర్శలు ఇతర రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్నా.. ‘గెలుపు అంటే గెలుపు’ మాత్రమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అనుకున్న స్థాయిలో మెజార్టీ రాకపోవడానికి కారణాలేంటన్నదానిపై కేసీఆర్ ఇప్పటికే ‘పోస్ట్ మార్టమ్’ పూర్తి చేసేశారట. ఇదిలా వుంటే, నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని అత్యంత భారీ మెజార్టీతో దక్కించుకుని తీరాల్సిందేనని కేసీఆర్ భావిస్తున్నారు. తాజాగా ప్రకటించిన పీఆర్‌సి ద్వారా ఉద్యోగుల మన్నననల్ని సాగర్ ఉప ఎన్నికకి ముందే పొందగలిగారు కేసీఆర్.
ఇది కాస్త అధికార పార్టీకి ప్లస్ పాయింట్ కాబోతోందన్నది నిర్వివాదాంశం. మరోపక్క, కేసీఆర్ స్వయంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వ్యవహారాన్ని పార్టీ పరంగా పర్యవేక్షించబోతున్నారట. కరోనా భయాలున్నా.. పార్టీ కోసం కేసీఆర్ స్వయంగా పార్టీ శ్రేణుల్ని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయమై రథ పారధిగా నడిపించబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్య నేతల్ని మోహరించడం దగ్గర్నుంచి, ప్రచారానికి సంబంధించిన వ్యూహాల్ని.. కేసీఆర్ స్వయంగా అమలు చేయబోతున్నారట. నియోజకవర్గంలో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలపైనా కొద్ది రోజుల్లోనే స్పష్టత రాబోతోందని సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి విషయమై గులాబీ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.