త్వరలో ఏపీ బడ్జెట్.. ఈసారైనా మధ్యతరగతిని పట్టించుకుంటారా ?

ఏపీ ప్రభుత్వం 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సన్నద్దమవుతోంది.  నిజానికీ ఈ సమావేశాలు ఇదివరకే జరగాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డాయి.  ఆ సమయంలో ఆర్డినెన్స్ ద్వారా నాలుగు నెలలకు సరిపోయేలా గవర్నర్ ఆమోదంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.  ఈ నెల 30తో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సుకు గడువు ముగియనుండటంతో బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పదు.  దీంతో ప్రభుత్వం ఈ నెల 16న సమావేశాలు మొదలుపెట్టాలని భావిస్తోంది. 
 
18న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడటారు.  ఈ బడ్జెట్ మీద మధ్యతరగతి వర్గాలు చాలానే ఆశలు పెటుకున్నాయి.  వైఎస్ జగన్ తొలి యేడాది మొత్తం సంక్షేమ పథకాలు పేరుతో పెద వర్గాలకు, రైతులకు నవరత్నాల కింద వేల కోట్లు నేరుగా అకౌంట్లలోకి జమచేశారు.  ఈ పథకాలన్నీ పేదరికం, కొన్ని మతం ప్రాతిపదికనే జరిగాయి.  ఈ సంవత్సరంలో మధ్యతరగతి వర్గాలకు పెద్దగా ప్రయోజనాలేవీ లభించలేదు. 
 
పైగా కరోనా లాక్ డౌన్ కారణంగా అందరితో పాటు మిడిల్ క్లాస్ వర్గం కూడా ఆర్థికంగా బాగా దెబ్బతింది.  కొందరు ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది.  ఈ కష్టాల నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో తమకు కూడా ఆర్థిక సహాయం అందే ఏర్పాటు చేస్తే బాగుంటుందని, సొంత ఇళ్లను కేటాయించి, ఆరోగ్య శ్రీ తమకు కూడా వర్తించేలా చేస్తే మేలు జరుగుతుందని మధ్యతరగతి వర్గాల వాదన.  మరి ప్రభుత్వం వారి మీద ఏమైనా వరాల జల్లు కురిపిస్తుందేంంమో చూడాలి.