జిన్నా టవర్ పేరు మార్చలేరుగానీ.. కోనసీమ పేరు మార్చుతారట.!

కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెడితే నష్టమేంటి.? ఔను, నష్టం లేదు. జిన్నా టవర్ పేరుని అబ్దుల్ కలాం టవర్‌గా మార్చేందుకు అభ్యంతరమేంటి.? ఔను, అభ్యంతరం ఏముంటుంది.?

జిన్నా పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి. ఆ జిన్నా పేరు భారతదేశంలో ఎందుకు వినిపించాలి.? ఔను, అదీ నిజమే కదా.? కానీ, మన పాలకులకి అదేమీ కనిపించదు. కానీ, ప్రశాంతంగా వున్న కోనసీమలో చిచ్చు పెట్టడానికి అంబేద్కర్ పేరుతో వివాదం తెరపైకి తీసుకురావాలి. అదే జరిగిందిక్కడ.!
అంబేద్కర్ పేరుని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడంలో దాదాపుగా అన్ని పార్టీలదీ ఒకటే తీరు.

దళిత జాతి ఆణిముత్యంగా అంబేద్కర్‌ని ఓ సామాజిక వర్గానికే పరిమితం చేసేసిన రాజకీయం మనది. పోనీ, ఆ కోణంలోనే చూద్దాం. వైసీపీ నుంచి ఏ దళితుడినీ ఎందుకు రాజ్యసభకు పంపలేదట.? పోనీ, వైఎస్ జగన్ కోటరీగా చెప్పబడుతున్న నాయకుల్లో ‘హైలీ రెస్పెక్టెడ్’ సామాజిక వర్గం తప్ప, దళితులకు ఎందుకు చోటు లేదట.? ఇలాంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి విపక్షాల నుంచి.

జిన్నా టవర్ విషయమై భారతీయ జనతా పార్టీ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ఇంత యాగీ జరుగుతున్నందున అధికార వైసీపీ, ఆ జిన్నా టవర్ పేరుని మార్చేయడానికి నిర్ణయం తీసుకోవచ్చు. దానికి ఒక్క క్షణం కూడా సమయం పట్టదు.

కానీ, కోనసీమ కథ వేరు. పెట్టిన పేరు మార్చాలంటే అదో పెద్ద తంటా. జరుగుతున్న యాగీ చూస్తూనే వున్నాం. ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ వుంటుంది. పేరు మార్చితే ఏం జరుగుతుందో ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టకుండా వుంటుందా.?