ఆంధ్రాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలతో స్నేహాలు చేసింది. ప్రజెంట్ జనసేనను మిత్రపక్షంగా చేసుకుని అడుగులు వేస్తోంది. అయితే అధికార పార్టీ వైసీపీతో కూడా భాజాపా మొదటి నుండి సౌమ్యంగానే ఉంటూ వస్తోంది. సీఎం జగన్ స్పెషల్ స్టేటస్ వంటి కీలకమైన విషయాల్లో భాజాపాను ప్రశ్నించడంలేదు. వారు ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులకు మద్దతిస్తున్నారు. దీంతో భాజాపా జగన్ విషయంలో నిదానంగానే ఉన్నట్టు కనబడింది.
కానీ భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తాజాగా వైఎస్ జగన్ మీద చేసిన విమర్శలు భాజాపా ద్వంద వైఖరిని స్పష్టంగా బయటపెట్టాయి. రాంమాధవ్ మాట్లాడుతూ ఏపీలో ఒకరు బెయిల్ మీద బయట ఉన్నారని జగన్ మీద పరోక్షంగా చురకలు వేశారు. అంతేకాదు జగన్ పాలన మొత్తం రివర్స్ అని రాజధాని తరలింపు, రివర్స్ టెండరింగ్స్, శ్రీవారి భూములు, నిమ్మగడ్డ ఇష్యూ ఇలా అన్నింటిలో జగన్ వెనక్కి పోతున్నారని అంటూ అన్ని తప్పులకు లెక్కలు ఉన్నాయని, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన తప్పులన్నింటినీ క్షమించేసినట్టు కాదని హెచ్చరిక స్వరంతో మాట్లాడారు.
మరోవైపు జీవీఎల్ నరసింహరావు లాంటి నేతలు జగన్ పట్ల సానుకూలంగానే ఉన్నట్టు మాట్లాడతారు. కేంద్ర న్యాయకత్వం కూడా రాజధాని తరలింపు విషయంలో జగన్ కు అడ్డు తగలడం లేదు. ఈ పద్దతి చూస్తే సిట్యుయేషన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పక్కనబెట్టుకోవడానికైనా, పక్కనబెట్టడానికైనా భాజాపా సిద్దంగా ఉందని ఇట్టే అర్థమైపోతోంది. అసలు భాజాపా రాజకీయమే అంత. అందుకు నిదర్శనమే టీడీపీ. కనుక జగన్ తన జాగ్రత్తల్లో తాను ఉండటం శ్రేయస్కరం.