2024 ఎన్నికలకు ఏపీలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారనున్నాయి. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం బీజేపీ అవలంభిస్తున్న రాజకీయమే. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలతో బీజేపీ స్నేహంగానే ఉంటోంది. జనసేనతో పూర్తిస్థాయి పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ టీడీపీతో, వైకాపాతో ద్వంద వైఖరిని అవలంభిస్తోంది. ఇలా అవలంభించడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉంది. ఆ ప్లాన్ మొత్తం 2024 ఎన్నికల్లో ఆధిపత్యం కోసమే. ప్రజెంట్ వైఎస్ జగన్ బలాన్ని బట్టి 2024కి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నా అధికారంలోకి రావడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదని సులభంగానే అర్థమవుతోంది.
Read More : ‘సూఫీయం సుజాతాయుమ్’ – కథ తక్కువ మతం ఎక్కువ!
అందుకే బీజేపీ దృష్టి మొత్తం తెలుగుదేశం మీదే ఉంది. 2024 నాటికి చంద్రబాబు నాయుడు పుంజుకుని పార్టీని నిలబెట్టుకోలేక పోతే జనసేనతో కలిసి ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది బీజేపీ ఆలోచన. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీకి బలమైన కేంద్రంగా మారుతుంది. ఒక్కసారి ప్రతిపక్ష హోదాలో కూర్చుకుంటే అధికారానికి చాలా దగ్గరగా వెళ్లినట్టే. ఎలాగూ కేంద్రంలో ఉండేది తామే కాబట్టి తర్వాతి దఫాకు ఎలాగోలా కుర్చీ ఎక్కవచ్చని భాజపా భావిస్తోంది. ఇదంతా తెలుగుదేశం బలపడలేకపోతే జరిగే పరిణామం. ఒకవేళ టీడీపీ తిరిగి నిలదొక్కుకోగలిగితే బీజేపీ వద్ద మరొక ప్లాన్ ఉంది.
అదే పొత్తు. 2014లో ఎలాగైతే టీడీపీ, జనసేనలతో కలిసి పోటీకి దిగిందో 2024కి కూడా అలాగే దిగుతుంది. కానీ 2014లో టీడీపీకి ఉన్నంత ప్రాముఖ్యం ఈసారి ఉండకపోవచ్చు. సీట్ల విషయంలో బీజేపీ ఎక్కువ డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా పార్లమెంట్ సీట్లలో ఎక్కువ తమకే కేటాయించమని అడుగుతుంది. ఎందుకంటే ఈసారి ఉత్తరాదిన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాజాపాకు సీట్లు తగ్గే అవకాశం ఉంది. అందుకే వీలైతే ఈసారి ఏపీ నుండి ఎక్కువ ఎంపీ సీట్లలో పోటీ చేయాలని భాజపా ప్లాన్. అలా పోటీ చేసి ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలవగలిగితే రాష్ట్రం మీద కమలం పట్టు పెరిగినట్టే.
Read More : మెగాస్టార్ సినిమాలో రౌడీస్టార్!
ఒకవేళ కూటమి గెలిస్తే అందులో జనసేన గనుక కేటాయించిన ఎమ్మెల్యే సీట్లలో ఎక్కువ శాతం గెలుచుకోగలిగితే పాలనలో కూడా బీజేపీ పెత్తనం పుష్కలంగా ఉంటుంది. ఇక వైకాపా నుండి పిరాయింపులు లాంటి రెగ్యులర్ కార్యక్రమాలు ఎలాగూ ఉంటాయి. కాకపోతే పార్టీ మారే వారంతా బీజేపీలోకే వెళతారు. ఫలితంగా బీజేపీ బలం పెరుగుతూ పోతుంది. ఇదంతా టీడీపీ బలపడితే జరిగే పరిణామాలు. ఒకవేళ తెలుగుదేశం మరింత క్షీణించిపోతే బీజేపీ వైకాపాతో కలిసి పోటీకి దిగే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ఇక వారికి పవన్ కళ్యాణ్ ఆవసరం కూడా ఉండదు.
కానీ జగన్ వైఖరిని బట్టి ఆ కలయిక అసాధ్యమనే అనుకోవాలి. తీవ్రమైన కష్ట కాలంలో ఉన్నప్పుడే ఒకరి పొత్తు కోరని జగన్ బలంగా ఉన్నప్పుడు పొత్తును ఆహ్వానిస్తారని అనుకోలేం. కాబట్టి భాజపా బలహీనంగా ఉన్న టీడీపీని పక్కకు పెట్టి జనసేనతో కలిసి వైకాపాకు ప్రధాన ప్రట్యర్థిగా మారుతుంది. అంటే పైన చెప్పుకున్నట్టు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం టీడీపీతో పోటీ పడుతుందన్నమాట. సో… ఎలాగైనా ఈ దఫాలో తన మార్క్ చూపాలని, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది భారతీయ జనతా పార్టీ ప్లాన్. ఈ పథకాన్ని అడ్డుకోవాలంటే మన స్థానిక పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేనలు భాజపాకు అవకాశం ఇవ్వకుండా సాహసవంతమైన, నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలి.