మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఈ ఉదయం ఎన్ కౌంటర్ చేసారు. ఉజ్జయిని నుంచి కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో దూబే అదునుగా భావించి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో పోలీసుల తుపాకులను లాక్కుని కాల్పులకు తెగబడ్డాడు. దీంతో యూపీ పోలీసులు కూడా ఎదురు కాల్పులు చేయడంతో దూబే తూటాకి బలయ్యాడు. సరిగ్గా కాన్పూర్ వద్దే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దూబే గ్యాంగ్ స్టర్ చరిత్ర నేటితో పోలీసులు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. ఈ ఘటనతో యూపీ ఒక్కసారిగా దద్దరిల్లింది. దూబే చేతిలో అమరులైన పోలీసులకు న్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నాయి.
కొన్నేళ్లగా నేర చరిత్ర ఉన్న దూబే కాన్ఫూర్ని కింగ్ గా ఏలాడు. దందాలు, సెటిల్ మెంట్లు, భూకబ్జాలు చేసి గ్యాంగ్ స్టార్ గా మారాడు. కాన్ఫూర్ కింగ్ నంటూ చెప్పుకున్నాడు. దీంతో యూపి పోలీసులు అరెస్ట్ కు రంగం సిద్దం చేసి వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో దూబే కాల్పుల్లో ఓ ఉన్నత స్థాయి పోలీస్ అధికారితో పాటు మరో ఏడుగురు పోలీసులు అమరులయ్యారు. దీంతో యూపీ పోలీసులు దూబే కోసం గాలింపు ముమ్మరం చేసి చివరికి ఉజ్జయిని లో పట్టుకున్నారు. నేడు కాన్పూర్ తరలిస్తుండగా మరోసారి దూబే చేతివాటం చూపే ప్రయత్నం చేసి..చివరికి పోలీసుల చేతుల్లోనే హతమయ్యాడు.