ఇంటి ముందే చెత్త.. పరువు పోతున్నా వైసీపీ సర్కార్ తీరు మారదా?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ చెత్త పన్నును వసూలు చేయడం ద్వారా విమర్శలు మూటగట్టుకుంటోంది. ఏపీలో చెత్తపన్ను ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే చెత్తపన్ను విషయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. చెత్తపన్ను కట్టని వాళ్ల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. విజయనగరంలో మున్సిపాలిటీ అధికారులు చెత్తపన్ను చెల్లించలేదంటూ అమృత రెసిడెన్సీ ముందు చెత్తను పారబోశారు.

ఎందుకు చెత్తపన్నును పడేస్తున్నారంటూ ప్రశ్నించిన వాళ్లపై వైసీపీ నేతలు దాడి చేశారని అపార్టుమెంట్ వాసులు చెబుతున్నారు. తమపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని అపార్టుమెంట్ వాసులు కోరుతున్నారు. చెత్తపన్ను కట్టడం లేదంటూ ప్రభుత్వం ప్రజల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం వసూలు చేయని పన్నులను జగన్ సర్కార్ వసూలు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చెత్తపన్ను విషయంలో ఏపీ ప్రజల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో మరో 20 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇళ్లకు వెళుతున్న వైసీపీ నేతలకు చెత్తపన్ను విషయంలో భారీ షాకులు తగులుతున్నాయి. ఇంటిపన్నును వసూలు చేస్తున్న జగన్ సర్కార్ చెత్తపన్నును ప్రత్యేకంగా వసూలు చేయడం ఏంటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెత్తపన్ను విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. జగన్ రాబోయే రోజుల్లో కచ్చితంగా చెత్తపన్నుకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. చెత్తపన్ను వసూలు ఏపీ ప్రభుత్వంపై, 2024 ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.