ఏపీ సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో వైసీపీని కచ్చితంగా గెలిపించాలనే ఆలోచనతో సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీకి నష్టం చేస్తున్న ఎమ్మెల్యేల, ఎంపీల విషయంలో కఠినంగా వ్యవహరించడానికి జగన్ సిద్ధమవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే జగన్ నుంచి వారికి సందేశాలు అందాయి. మరి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం జగన్ పొమ్మనలేక పొగబెడుతున్నారు.
ఏపీలోని కొన్ని స్థానాలలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపోవడంతో అక్కడ అభ్యర్థులను మార్చితే తప్ప వైసీపీ పరిస్థితి మెరుగుపడే అవకాశమే లేదని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే మరో 30 సంవత్సరాల పాటు రాష్ట్రంలో వైసీపీదే అధికారం అని జగన్ భావిస్తున్నారు. జనసేన పార్టీ ఏపీలో పెద్దగా ప్రభావం చూపదని జగన్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించడానికి కూడా ఇదే కారణమని బోగట్టా. ఇతర పార్టీల మీడియాలకు ఆమె అనుకూలంగా వ్యవహరించడంతో ఆమెకు చెక్ పెట్టే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. 58 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 12 లోక్ సభ స్థానాలలో కూడా అభ్యర్థుల మార్పు దిశగా వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది.
2024 ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయి ఫలితాలు రావడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను జగన్ తీసుకుంటున్నారని సమాచారం. మరి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా త్వరలో షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనుభవం ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సైతం షాకిచ్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.