గాల్లో క‌రోనా..కండీషన్స్ అప్లై

గాలి ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తోంద‌ని 200 మందికిపైగా శాస్ర్త‌వేత్త‌లు చెబుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు లేఖ రాయ‌డం.. ఆ సంస్థ కూడా మొద‌ట్లో గాలి ద్వారా సోక‌ద‌ని ఖండించినా చివ‌రికి శాస్ర్త‌వేత్త‌ల మాట‌కు క‌ట్టుబ‌డింది. అయితే దీనిపై పూర్తిగా ప‌రిశీలించాల్సి ఉంద‌ని తెలిపింది. తాజాగా ఆ ప‌రిశీల‌న కూడా పూర్త‌యింది. గాలి ద్వారా కూడా క‌రోనా సోకుతుంద‌ని డ‌బ్లూ హెచ్ ఓ వెల్ల‌డించింది. అయితే అందుకు కొన్ని కండీష‌న్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ గాలి ద్వారా వ్యాపింద‌ని..కొన్ని ప్రాంతాల్లోనే అందుకు అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. వైర‌స్ సోకిన వ్య‌క్తులు ఎక్క‌డైతే ఎక్కువ‌గా ఉంటారో అక్కడ గాలి ద్వారా వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

ఎక్కువ ర‌ద్దీ గా ఉండే ఇండోర్ ప్ర‌దేశాలు, ఎక్కువ వెంటిలేష‌న్ లేని ప్రాంతాల్లో వైర‌స్ సోకిన వ్య‌క్తుల నుంచి మ‌రింత మందికి వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఎసింప్ట‌మేటికి అంటే వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని వ్య‌క్తుల‌తోనూ వైర‌స్ వ్యాప్తి పెరుగుతున్న‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే వైర‌స్ వ్యాప్తి చేయ‌గ‌ల సామ‌ర్ధ్యం ఎసింప్ట‌మేటిక్ వ్య‌క్తుల‌లో ఉన్న‌ప్ప‌టికీ చాలా అరుదుగా మాత్ర‌మే వ్యాప్తి ఉంటుంద‌ని డ‌బ్లూ హెచ్ ఓ తెలిపింది. దీంతో ఈ వ్యాప్తిని క‌రోనాకి కొత్త రూపంగా చెప్పుకోవాల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కూ గాలి ద్వారా వ్యాపించ‌ద‌ని ప్ర‌పంచ దేశాలు కొంత నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం జ‌రిగింది.

తాజాగా డ‌బ్లూ హెచ్ ఓ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌పంచ దేశాలు మ‌రింత అప్ర‌మ‌త్త‌గా ఉండాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఇప్ప‌టికే కొన్ని దేశాల్లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ భార‌త్ లో మాత్రం అన్ లాక్ కొన‌సాగుతుంది. కేవ‌లం రాత్రి స‌మ‌యంలో క‌ర్ప్యూ ఉంటుంది. ఇప్ప‌టికే దేశంలో కేసుల సంఖ్య తో పాటు, మ‌ర‌ణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స‌మూహ వ్యాప్తి ద‌శ‌కు ద‌గ్గ‌ర్లో భాత‌ర్ ఉంద‌ని సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. కేసులు ప‌రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మూడ‌వ స్థానంలో కొన‌సాగుతోంది భార‌త్. తాజాగా గాలి ద్వారా కూడా క‌రోనా సోకుతుంద‌ని నిర్ధారించ‌డంతో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే కొన్ని రాష్ర్టాల ప్ర‌భుత్వాలు చేతులు ఎత్తేసాయి. స‌మూహ వ్యాప్తి ద‌శ‌కు భార‌త్ చేరుకుంటే ప‌రిస్థితి పూర్తిగా చేయిదాటిపోయిన‌ట్లే.