బుధవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో ఆమోదం పొందిన కీలక అంశాల్లో ఒకటిగా కొత్త జిల్లాల ఏర్పాటు నిలిచింది. ఈసమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీసీఎల్ ఏ కమీషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్ గా పైనాన్స్ ప్రిన్స్ పల్ సెక్రటరీ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
అధ్యయనం పూర్తిచేసి వీలైనంత వేగంగా నివేదిక ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జగన్ అధికారంలోకి రాకముందే మెనిఫెస్టెలో ఒక అంశంగా పెట్టారు. ఇటీవలే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వేగవంతం చేసారు. దీనిలో భాగంగా పలువురు మంత్రులు జిల్లాల ఏర్పాటుపై ప్రజలకు వివరించడం జరిగింది. ఇక 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే 26వ జిల్లాకు సంబంధించి నేటి మంత్రి వర్గ సమావేశంలో చర్చకొచ్చింది.
అరకు జిల్లా బౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్పవాణి అన్నారు. 4 జిల్లాలకు అరకు ప్రాంతం విస్తరించి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు గా ఏర్పాటు చేసేలా అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అయితే శ్రీకాకుళం జిల్లాను విభజించొద్దని ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై కెబినెట్ భేటీలో ఎలాంటి చర్చ సాగింది అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు.