కరోనా వైరస్ వైసీపీ లీడర్లకు సోకదా!

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రం, జిల్లా, మండలం లేవు.  దాదాపు ప్రతిచోటా ఈ మహమ్మారి తిష్ట వేసింది.  దీంతో వైద్య నిపుణులు భౌతిక దూరం, ప్రాపర్ శానిటైజేషన్ మాత్రమే మార్గాలని సూచిస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం అయితే లాక్ డౌన్ నిబంధనల్లో ప్రధానమైనదిగా భౌతిక దూరాన్ని చేర్చింది.  ఎక్కడా జనం గుంపులు గుంపులుగా చెరకూడదని రూల్ పెట్టింది.  ఇందుకుగాను ఎలాంటి సభలు, సమావేశాలు, వేడుకలు జరగకూడదని ఆంక్షలు విధించింది.  వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 
 
ఈ మేరకు ఉల్లంఘనకు పాల్పడిన చాలామందిపై పోలీసులు పోలీసులు కేసులు నమోదుచేశారు.  లాక్ డౌన్ సమయంలో బయటికొచ్చిన జనం మీద లాఠీలు కూడా విరిగాయి.  రాజకీయ పార్టీల నేతలు జనానికి రూల్స్ పాటించమని చెబుతూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటే కొందరు నేతలు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు.  తాజాగా నిన్న విశాఖలో అధికారపార్టీ ఎంపీ, మంత్రి వారి అనుచరులు చేసిన హంగామానే దీనికి నిదర్శనం.  నిన్న విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ కలిసి జగన్ సర్కార్ ఏడాది పాలన ముగిసిన సంధర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, మంత్రి, ఎంపీ అనుచరులు హాజరయ్యారు.  భౌతిక దూరం మరచి మాస్కుకు సైతం తీసేసి పూల దండలతో నేతల్ని సత్కరించారు.  ఒకరికొకరు కేకు ముక్కలు తినిపించుకున్నారు.  ఈ వ్యవహారం చూసిన జనం రూల్స్ పాటించి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులే ఇలా ఉల్లంఘనకు పాల్పడితే ఎలా.. వైసీపీ నేతలు అధికార పార్టీ వాళ్లైనంత మాత్రాన వారికి కరోనా సోకదా ఏమిటి.  రూల్స్ బ్రేక్ చేసిన వీరిపై పోలీసులు చర్యలేమైనా తీసుకుంటారా లేదా అంటున్నారు.