కరోనా వచ్చినా  బాధ లేకపోతే.. ? 

కరోనా కొత్త రూపంలోకి మారిందా ? కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్‌ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక్షల్లో పాజిటివ్ వస్తోంది. వారు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత కోలుకుంటున్నారు. కాకపోతే అలాంటి వారికి ఎలాంటి ప్రమాదం ఉంటుందనే అనుమానాలు వారిలో వస్తున్నాయి. వీరి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లక్షణాలు కనిపించని వారికి ఇన్ఫెక్షన్‌ కారణంగా శరీర భాగాలేమైనా దెబ్బతినే అవకాశం ఉందా.. అన్నదానిపై కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వీరు ఎటువంటి ఆందోళన చెందవద్దంటున్నారు వైద్యులు. అసింప్టమాటిక్‌ వారు కంగారుపడాల్సిన పనిలేదని… కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉన్నందునే అది ప్రభావం చూపలేకపోయిందని ఏపీ కోవిడ్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్ రాంబాబు చెప్పారు. శ్వాసకోశ సమస్య ఉంటే తప్ప వారికి ఆస్పత్రి వైద్యం అవసరం లేదు. ఇంట్లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఇలాంటి వారి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వైరస్‌ సోకిన 10 రోజుల్లోపే అలాంటి వారి నుంచి వైరస్‌ ఇతరులకు సోకుతుంది.

ఆ తర్వాత అది బలహీన పడిపోతుంది. ఎలాంటి వైద్యమూ లేకుండానే కోలుకున్నా వారి శరీర భాగాలేవీ దెబ్బతినవని రోగులు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. చాలామంది అసింప్టమాటిక్‌ వ్యక్తులు తమకు పాజిటివ్‌ అని తెలిశాక డీలా పడుతున్నారు. వీళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడాల్సిన పనిలేదు. మిగతా వారితో పోలిస్తే వీరికి త్వరగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.