ఐపీఎల్ స్ఫాన్సర్‌షిప్ ‌కి వివో గుడ్ బై ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌ నుంచి చైనాకి చెందిన మొబైల్ కంపెనీ వివో శాశ్వతంగా తప్పుకోవడం లాంఛనమే. గల్వాన్ లోయలో గత ఏడాది చైనా సైనికులు దుశ్చర్య కారణంగా.. ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి వివోని తప్పించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బిడ్‌లను ఆహ్వానించింది.

దీనితో గత ఏడాదిగానూ రూ.222 కోట్లతో డ్రీమ్ ఎలెవన్ ఆ టైటిల్ స్ఫాన్సర్ ‌షిప్‌ ని దక్కించుకుంది. 2018లో ఐదేళ్ల కాలానికి టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌‌ని రూ.2,190 కోట్లతో దక్కించుకున్న వివో.. రెండేళ్ల పాటు ఏటా రూ.440 కోట్లు చెల్లించింది. ఈ కాంట్రాక్ట్ గడువు 2022 వరకూ ఉండటంతో.. ఈ ఏడాది మళ్లీ వివో స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని వార్తలు వచ్చాయి. కానీ.. గత ఏడాది టోర్నీకి కొద్దిరోజుల ముందు బీసీసీఐ తమని స్ఫాన్సర్‌షిప్ నుంచి తప్పించి ఉండటం.. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. మరోసారి వివో ఆ అవమానానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ఇప్పటికే బీసీసీ‌ఐతో చెప్పిన వివో సంస్థ.. కాంట్రాక్ట్‌ని బదిలీ చేసేందుకు మాత్రం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం కొత్తగా బిడ్‌లను ఆహ్వానించినా.. రూ.222 కోట్లకి అటు ఇటుగా మాత్రమే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున.. వివో కాంట్రాక్ట్‌ని వేరే సంస్థలకి బదిలీ చేయడం ద్వారా 2022 వరకూ ఏటా కనీసం రూ.440 కోట్లు ఆర్జించాలని బీసీసీఐ యోచిస్తోంది