శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవుల భర్తీపై జగన్ సర్కార్ సీరియస్ గా పనిచేస్తోంది.శ్రావణ మాసం కూడా దగ్గరపడటంతో సర్కార్ ఆ పనులను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపీదేవి వెంకటరమణ లతో ఖాళీ అయిన పదవుల్ని మళ్లీ అదే సామాజిక వర్గమైన బీసీ నేతలతోనే భర్తీ చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గంలో ఆ రెండు పదవులకు ఆశావహుల జాబితా పెద్దదిగానే ఉందని తెలుస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ఆశపడుతున్నట్లు తెలిసింది. ఇక మరోవైపు గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యే రెండు ఎమ్మెల్సీ పదవులపైనా తాజాగా ఆసక్తి సంతరించుకుంది.
జగన్ సర్కార్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. ఈ రెండు స్థానాలకు కూడా త్వరలో అభ్యర్ధుల్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు స్థానాలో ఎస్సీ, మైనార్టీ వర్గానికి చెందిన నేతలు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అదే వర్గానికి చెందిన నేతల్ని పంపించాలని జగన్ గవర్నర్ కు సిఫార్స్ చేసినట్లు సమాచారం. చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరు దాదాపు ఖరారైందని అంటున్నారు. రెండో స్థానం కోసం అధిష్టానం ఇద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ భార్య జకియా ఖాన్.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజు పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో ఒకరికి రెండో సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నేటి కేబినేట్ లో ఈ అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ స్పీడ్ చూస్తుంటే వచ్చే రెండేళ్లలో మండలిలో వైకాపా బలం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీకి మండలిలో బలం ఉండటంతో వైకాపా బిల్లులకు అడ్డు తగులుతోంది. ఈ నేపథ్యంలో మండలిని రద్దు చేసి కేంద్రానికి సిఫార్స్ పంపిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్ లో టీడీపీ బలం ఎలాగూ తగ్గుతుందని భావించిన జగన్ ఇప్పుడు రద్దు విషయంలో యూ టర్న్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.