వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు-జగన్ సర్కార్ మధ్య నెలకొన్న వైరం గురించి తెలిసిందే. ఇప్పటికే వైకాపా ఎంపీలు , మంత్రులు రఘురాం తీరును తప్పు బడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత నియోజక వర్గం నరసాపురంలోనే రెండు వర్గాలుగా చీలిపోయిన నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధరాజు రఘురాంపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మంత్రిపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను తన పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు సహజంగా ఉండేవే గానీ, మరీ వ్యక్తిగతంగా వెళ్తే ఎవరి మనసైనా నొచ్చుకుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తనని, తన కుమారుడిని వ్యక్తిగతంగా దూషించినందుకు మనస్థాపం చెందానని మంత్రి పేర్కొన్నారు. పందులే గుంపులుగా వస్తాయని ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించడం క్షమించరానిదని మంత్రి మండిపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నాడని, తన మద్దతు దారులతో తన దిష్టబోమ్మను తగలబెట్టి వర్గాల మధ్య వైషామ్యాలను సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజ్యంగ బద్దమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటంపై ఆక్షేపించారు. వాటన్నింటికి రఘురాం తప్పక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. దీంతో నరసాపురం నియోజక వర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. రఘురాం పార్టీని విబేధించడంతో ఒకే పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో రఘురాం అనర్హత వేటుపై నియోజక వర్గంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ లు సైతం జరిగాయి. తాజాగా మంత్రి ఏకంగా పోలీసుల్నే ఆశ్రయించడంతో ఆ విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.