దేశంలోకి కరోనా ఎంట్రీ.. ఆ తరువాత లాక్ డౌన్.. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రాష్ట్రాల్లోనూ ఆదాయానికి గండిపడింది. అయితే లాక్ డౌన్ లోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించగా ధనిక రాష్ట్రం అయిన తెలంగాణలో మాత్రం ప్రభుత్వం కోతలు విధించడం దురదృష్టకరం. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఉద్యోగులకు ఎంతెంత కోత విధిస్తున్నారో ప్రకటించారు. వైద్య, పోలీస్, పారిశుధ్య, విద్యుత్ శాఖలను మినహాయించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సగం జీతంతోనే సరిపెట్టి సైలెంట్ అయిపోయారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ చెప్పినా అది ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు.
ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు ప్రభుత్వం సగం జీతాన్ని మంజూరు చేసింది. అయితే మే నెలలో తెలంగాణలో భారీగా సడలింపులు ఇవ్వడంతో పూర్తిస్థాయి వేతనం అందుతుందని ఉద్యోగులు భావించినా, వారి ఆశలు ఆవిరైయ్యాయి. మే నెలలోనూ వారికి సగం జీతమే దక్కింది. గత మూడునెలలుగా ఉద్యోగులకు సగం జీతం రావడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక జూన్ నెల జీతం పై కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.
కనీసం జూన్ నెల నుంచైనా తమకు పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల జీతం, ఫించన్లో కోతలు పెట్టొద్దని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే దీని పై సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.