రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అలా కూల్ చేసిన జగన్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిని ప్రదర్శిస్తున్న వేళ… కీలకమైన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. అయితే ఈ భేటీ అనంతరం ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన జగన్… ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పలు సంచలన నిర్ణయాలు వెల్లడించారు.

గతకొంతకాలంగా ఏపీ సర్కార్ వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులు రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన సీపీఎస్ అమలు అనేది కీలకంగా ఈ రచ్చ నడిచేది. అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ… సీపీఎస్ కు మార్పు చేస్తూ కూడా జగన్ వారిని కూల్ చేశారు.

ఇందులో భాగంగా… సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పాత ఫించను పథకానికి సమానండే ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు.

ఇదే సమయంలో కొత్త పీఆర్‌సీ ఏర్పాటునకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022 – జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్‌ తో 2.73 శాతం డీఏ వర్తింపజేయనుంది. జిల్లా కేంద్రాల్లో పని చేసేవాళ్లకు 12 నుంచి 16 శాతానికి హెచ్‌.ఆర్‌.ఏ ను పెంచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి స్వాగతించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఉద్యోగ సంఘ నాయకుడు… ఉద్యోగులకు సంబంధించిన 5 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరమని.. డీఏ జీవోలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలని.. జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్.ఆర్.ఏ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామం అని జగన్ సర్కార్ ని కొనియాడారు! దీంతో… ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కు ఒక టెన్షన్ తప్పిందని అంటున్నారు పరిశీలకులు!