ఈ ఎస్ ఐ స్కాంలో ట్విస్ట్..ముంద‌స్తు బెయిల్ కి మ‌రో ఇద్ద‌రు!

ఈఎస్ ఐ స్కాం కొత్త మ‌లుపు తిరుగుతుందా? ఈ కుంభ‌కోణంలో ఇంకా బ‌డా నేత‌ల హ‌స్తం ఉందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇప్ప‌టికే ఈఎస్ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటు మ‌రో తొమ్మది మందిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసి విచారించింది. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. అయితే అచ్చెన్న ఏసీబీ అధికారుల ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలు చెప్ప‌క‌పోవ‌డంతో విచార‌ణ అసంతృప్తిగానే ముగిసింది. ఈ నేప‌థ్యంలో అచ్చెన్న‌ను మ‌రోసారి క‌స్ట‌డీకి తీసుకుంటారా? అనే సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

ఇప్ప‌టికే అచ్చెన్న‌ను మెరుగైన వైద్యం కోసం ప్రయివేటు ఆసుప‌త్రికి త‌ర‌లించేలా హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో వైద్యం పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో గురువారం సాయంత్రం పితాని స‌త్య‌నారాయ‌ణ కుమారుడు సురేష్ ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. గ‌తంలో పితాని ద‌గ్గ‌ర పీఎస్ గా ప‌నిచేసిన ముర‌ళీ మోహ‌న్ కూడా ముంద‌స్తు బెయిల్ పిటీష‌న్ కు దాఖ‌లు చేసారు. ఈ రెండు పిటీష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం తీర్పును రిజ‌ర్వ్ లో పెట్టింది. దీంతో ఈ రెండు పిటీష‌న్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ స్కాంలో వాళ్లు భాగ‌స్వాములేనా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

లేదంటే ఇప్ప‌టికిప్పుడు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం వెనుక మ‌ర్మం ఏముంటుంద‌ని రాజకీయ వర్గాల్లో చర్చ‌కొచ్చింది. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ టీడీపీ నేత‌లు అరెస్ట్ అయితే గ‌నుక బ‌య‌ట‌కు వ‌చ్చే వ్యూహాలు కూడా ర‌చించే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని అచ్చెన్న అరెస్ట్ నేప‌థ్యంలో తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే ఇద్ద‌రు టీడీపీ వ‌ర్గీయులు బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్క‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అటు టీడీపీ అధిష్టానం స‌హా పార్టీ నేత‌లు అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంపిస్తున్నార‌ని ఆరోపించ‌డంపైనా తాజాగా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వీటికి బ‌ల‌మైన ఆధారాలు దొరికితే గ‌నుక ఏసీబీ అధికారులు మ‌రోసారి అచ్చెన్న‌ను క‌స్ట‌డీకి తీసుకోవ‌డం ఖాయం.