అగ్రిగోల్డ్ స్కామ్ మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రజలు నష్టపోయిన సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ సంస్థ బోర్డ్ తిప్పేసిన వెంటనే రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగి ఎవరికి అనుకూలంగా వారు ప్రకటనలు చేశారు. ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ బాధితుల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1150 కోట్లు కేటాయిస్తామని, వీలైనంత త్వరగా నిధులు విడుదల చేస్తామని మాటిచ్చారు. అది నమ్మిన జనం ఓట్లు వేశారు. జగన్ అధికారంలోకి రాగానే బాధితుల కోసం 1150 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో బాధితులు బాధలు తీరిపోతాయని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం మొదట దఫాగా 10 వేల నుండి 20 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి మాత్రమే పరిహారం అంటూ గతేడాది 264 కోట్లు కేటాయించింది. ఎన్నికలకు ముందేమో 1150 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం ఇలా కేవలం 264 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడంపై బాధిత సంఘం నిరసన తెలిపింది. పోనీ ఈసారి బడ్జెట్లో అయినా మిగిలిన నిధులు పూర్తిగా కేటాయిస్తారేమోనని భాదితులు ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం బడ్జెట్లో 200 కోట్లు మాత్రమే కేటాయించింది.
దీంతో బాధిత సంఘం ఛలో అసెంబ్లీ నిర్వహించాలని తలపెట్టింది. దీంతో సర్కార్ అప్రమత్తమై నిన్న రాత్రి నుండి హౌజ్ అరెస్టుల పర్వానికి తెర తీసింది. అగ్రిగోల్డ్ బాధిత సంఘం గౌరవ అధ్యక్షుడు f మంగళగిరిలోని ఇంట్లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే
వారికి మద్దతుగా ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ను గుంటూరులో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆదుకుంటామన్న వైఎస్ జగన్ ఇప్పుడు అరెస్టులు చేస్తారా.. బాధితులు మానసిక ఒత్తిడితో, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెప్పిన 1150 కోట్లలో వెంటనే సగం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.