రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తర్వాత రాష్ట్రంలో రెండో అతి పెద్ద పదవులు అసెంబ్లీ స్పీకర్, విధాన మండలి ఛైర్మన్. కానీ చాలా మంది నేతలు వీటిని అధిష్టించేందుకు ఇష్టపడరు. పేరు పెద్దగా ఉన్నా నామమాత్రపు పోస్టులు కావడంతో విముఖత చూపిస్తారు. దీనికి తోడు ఈ సీట్లో కూర్చుంటే ప్రజా జీవితాన్ని కోల్పోతారు. తద్వారా రాజకీయంగా బలహీనపడతారు. అందుకే ఈ పదువులంటే చాలా మందికి చిరాకు.
తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తాను ప్రజా జీవితంలో యాక్టివ్ గా ఉన్నప్పుడు మండలి ఛైర్మన్ కావడంతో ఏమీ చేయలేకపోయానని ఆయన అనేవారు. ఇక ప్రస్తుత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చురుకైన ప్రజాజీవితం గడిపిన నాయకుడే. గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ లో చేరినప్పుడు ఎమ్మెల్సీ అయి తద్వారా మంత్రి పదవి కావాలని ఆకాంక్షించారు. కాని ఆయన్ని మండలి ఛైర్మన్ పదవి మాత్రమే వరించింది. అందుకే గత ఛైర్మన్లతో పోల్చితే అవకాశం చిక్కినప్పుడల్లా మౌనముద్ర వీడుతున్నారు. అవకాశం కల్పించుకొని మరీ మాట్లాడుతున్నారు.
తాజాగా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ఆయన అన్నారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు అలా అన్నారనే చర్చ మొదలైంది. ఎలాగోల మళ్లీ క్యాబినెట్లో స్థానం దక్కించుకునేందుకు అలా అన్నారా…. లేక కేటీఆర్ సీఎం అన్న అంశాన్ని వివాదం చేసేందుకు అలా అన్నారా అనేది మొదట్లో అంత పట్టక చాలా మంది తర్జన భర్జన పడ్డారు.
అయితే మండలి ఛైర్మన్ అయినప్పటికీ గుత్తా తన నియోజకవర్గ ప్రజలను నిత్యం కలుస్తూనే ఉన్నారు. మీడియా ముందు మాట్లాడకపోయినా యాక్టివ్ గానే ఉంటున్నారు. దీంతో భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అయినప్పుడు ఆయన క్యాబినెట్ లో చేరేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారనే ప్రచారం జోరందుకుంది.