తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎనలేని ఉత్సాహంతో ఉంది. వరుసగా దుబ్బాక ఎన్నికలో గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 48 స్థానాలు సాధించడంతో వచ్చే ఎన్నికలకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఆ సన్నాహకాల్లో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ విధానానికి తెరతీశారు. కాంగ్రెస్, తెరాస పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపుకు లాక్కుంటున్నారు. బీజేపీ మొదటి నుండి కొందరు నాయకులను చేసి పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలోకి తీసికురావాలని డిసైడ్ అయింది. వారి జాబితాలో విజయశాంతి కూడ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఆమెను పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరలేదు. ఆ తర్వాత దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడ ట్రై చేశారు. ఎట్టకేలకు ఎన్నికల్లో బలం నిరూపించుకుని ఆమెను వలలో వేసేసుకున్నారు.
బీజేపీ ఇంతలా విజయశాంతి మీద గురిపెట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. తెలంగాణలో విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్ మరే మహిళా నేతకు లేదు. మొదటి నుండి ఆమెది ప్రత్యేక తెలంగాణ నినాదమే. ఆ నినాదంతోఈ బీజేపీలో చేరి ఆ తర్వాత తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పార్టీని తెరాసలో విలీనం చేశారు. తర్వాత కొన్నాళ్లకే కేసీఆర్ తో వచ్చిన విబేధాల కారణంగా ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రం ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడ కుదురుకోలేక కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. మళ్ళీ కొన్ని నెలల క్రితం యాక్టివ్ అయ్యారు.
వరుస పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని గ్రహించి తన కోసం ఎదురుచూస్తున్న భాజపాలో చేరిపోయారు. భాజపా కూడ నాయకుల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న తరుణంలో బలమైన లీడర్లు లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమని భావిస్తోంది. అందుకే విజయశాంతిని ఒక ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది. ఇప్పుడే పార్టీలోకి వచ్చిన ఆమెకు పెద్ద పెద్ద పనులు అప్పగించాలని చూస్తున్నారు కేంద్ర నాయకులు. వాటిలో మొదటిది కేసీఆర్ ను ఢీకొట్టడం. మొదటి నుండి విజయశాంతికి కేసీఆర్ అంటే అస్సలు పడదు. తనను కేసీఆర్ అణగదొక్కడానికి చూశారనే ఆగ్రహంలో ఉన్నారామె. ఆమెలోని ఈ కోపాన్నే అవకాశంగా మలుచుకుని కేసీఆర్ మీదకు ఉసిగొల్పాలనేది భాజపా ప్లాన్. అంతేకాదు పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్ భాద్యతలను కూడ అప్పగించే అవకాశం ఉంది.
ఇక పార్టీ బలోపేతం, కేడర్ నిర్మాణం, తెలంగాణ వాదుల మద్దతును కూడగట్టుకోవడం లాంటి రెస్పాన్సిబిలిటీస్ కూడ ఉంటాయి ఆమెకు. ఇవన్నీ సామాన్యమైన పంటకు కాదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే వీటన్నింటినీ నెరవేర్చి చూపాల్సి ఉంటుంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా విజయశాంతి రాజకీయంగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు యాక్టివ్ అయినా కాంగ్రెస్ కార్యకలాపాల్లో పెద్దగా వేలు పెట్టింది లేదు. కానీ ఇప్పుడు ఆ తరహా నడవడిక కుదరదు. విపరీతంగా పనిచేయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద భారాలను, బాధ్యతలను భుజానికెత్తుకోవాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీని ఆమెను పూర్తిస్థాయిలో వాడేయడం ఖాయం. మరి ఈ ఒత్తిడిని విజయశాంతి ఎలా తట్టుకుంటారో చూడాలి.