దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపకల్పన చేసిన గొప్ప సంక్షేమ పనుల్లో 108 అంబులెన్సు ఒకటి. ఎక్కడ ప్రమాదం జరిగినా, అత్యవసర చికిత్స అవసరమున్నా ఒక్క ఫోన్ కాల్ ద్వారా నిముషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని బాధితులకి వైద్య సహాయం అందిస్తూ ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడింది 108. ఈ పథకాన్ని దేశం మొత్తం కొనియాడింది. చాలా రాష్ట్రాలు ఈ 108 సర్వీసుల్ని ప్రారంభించాయి. ఎక్కడ 108 కనిపించినా వైఎస్సార్ గుర్తొచ్చేవారు. ఆయన ఉన్నన్ని రోజులు ఈ 108 సేవలకు గాను పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేవారు.
ఆయన తర్వాత వచ్చిన నేతలు కూడా ఈ సేవల్ని కొనసాగించినా వైఎస్ చేసినట్టు చేయలేకపోయారు. ఇప్పుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక 108 వాహనాలను మరింత మెరుగుపరిచి విస్తృతంగా సేవలను అందించడానికి సిద్దమయ్యారు. కొత్తగా 412 అంబులెన్సులను సిద్దం చేశారు. వీటితో పాటే ఇప్పటికే ఉన్న 336 పాత వాహనాలను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా రూపొందించారు.
బీఎల్ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఉండగా ఏఎల్ఎస్ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా లేటెస్ట్ వెంటిలేటర్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. నియోనేటల్ అంబులెన్సులలో ఇన్క్యుబేటర్లు, వెంటిలేటర్లు ఉంటాయి. ఈ స్థాయిలో అత్యాధునిక వసతులతో అంబులెన్స్ వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. మొత్తానికి రాజన్న 108 వ్యవస్థకు నడకలు నేర్పిస్తే జగన్ వాటిని పరుగులు పెట్టిస్తున్నారు. రేపు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద నుండి సీఎం ఈ అంబులెన్స్ సేవలను ప్రారంభించనున్నారు.