పక్క రాష్ర్ర్టం తెలంగాణ లో కార్పోరేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స పేరు ఎలా దోచుకుంటున్నాయో తెలిసిందే. అడ్డగోలు గా..లక్షలకు లక్షల రూపాయలు చికిత్స పేరుతో పేదల కుటుంబాల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాయి. చనిపోయిన తర్వాత శవాన్ని సైతం అప్పగించడానికి కండీషన్లు పెట్టి డబ్బులు గుంజుతున్నాయి కార్పోరేట్ ఆసుపత్రులు. ఇదేం దోపిడి అని ప్రశ్నిస్తే? భౌతిక దాడికి దిగుతున్నాయి యాజమాన్యాలు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం దీనిపై స్పందించింది లేదు. ఈనేపథ్యంలో నేరుగా ఆ రాష్ర్ట గవర్నర్ తమిళసై నే రంగంలోకి దిగారంటే? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం వ్యవహారమే వేరుగా ఉంది. తొలి నుంచి కరోనా కట్టడి విషయంలో పటిష్టంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎప్పటికప్పుడు కొవిడ్ ఆసుపత్రులు, అసోలేషన్ కేంద్రాలపై ప్రభుత్వ అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. ఏ ఒక్క పేషెంట్ నుంచి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని..అలా వస్తే? అధికారులే అన్ని సమాధానాలు చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రయివేట్ ఆసుపత్రులు కరోనా రోగుల పట్ల వివక్ష చూపకూడదన్నారు. కరోనా తో వస్తే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసుకుని మెరుగైన చికిత్స అందించాలని ప్రయివేట్ ఆసుపత్రులకు సూచించారు.
అలాకాకుండా జాయిన్ చేసుకోమని వెనక్కి పంపించేస్తే ఆ ఆసుపత్రి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయివేట్ ఆసుపత్రులు ఫీజులు తీసుకోవాలన్నారు. అలా కాకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆసుపత్రులంటే దేవాలయాలు లాంటివి. డాక్టర్లు దేవుళ్లతో సమానం. పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిందే ప్రభుత్వం, ఆసుపత్రి, డాక్టర్లు మాత్రమేనని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో మరింత దయతో వ్యవహారించాల్సిన అవసరముందని సూచించారు. అలాగే కరోనా తో మృతి చెందితే అంత్యక్రియల కార్యక్రమాలకు 15 వేలు ఆర్ధికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.