తెలంగాణలో కరోనా వైరస్ విలయ తాండవం ఆగడంలేదు. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే కానీ తగ్గే సూచనలు కనిపించట్లేదు. అధికార పార్టీ అగ్రనేతలు సైతం వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడురోజుల క్రితమే మహమూద్ అలీ టెస్టులు చేయించుకున్నారు. అస్తమా ఉండటంతో అప్రమత్తమైన కుటుంసభ్యులు ముందుగానే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు.
దీంతో ఇటీవల హోంమంత్రిని కలిసినవారందరి గురించీ అధికారులు వాకబు చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, జనగామ ఎమ్మెల్యే ముత్తురెడ్డి యాదగిరిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటిన్ కేసుల సంఖ్య 14,000లకు దగ్గరగా ఉంది. 10 రోజుల్లో 50,000 టెస్టులు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రోజుకు 5000 టెస్టులు కూడా చేయలేకపోతోంది. ఇక పరీక్షించాల్సిన శాంపిల్స్ భారీగా ఉండటంతో నిన్న శాంపిల్స్ సేకరణను నిలిపివేశారు.
నిన్న తెలంగాణ పోలీస్ అకాడమీలో 124 మంది పోలీసులకు వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం అధికారులతో చర్చలు జరుపుతున్న నేతలు త్వరలోనే లాక్ డౌన్ మీద ప్రకటన చేయనున్నారు. వైరస్ సోకిన ప్రజాప్రతినిధులందరినీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చి మెరుగైన చికిత్స అందిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలల్లో సామాన్య ప్రజలు పడే అవస్థలను పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు.