టీడీపీలోకి వస్తే ఎన్టీఆర్ మరో బాలకృష్ణ అవ్వాల్సిందేనా 

గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పొందడంతో ఆ పార్టీ నాయకత్వం మీదే అందరిలో సంశయం మొదలైంది.  ఎన్నడూ లేనిది చంద్రబాబు నాయకత్వంలో పార్టీ అంత దారుణంగా వైఫల్యం చెందడంతో సంక్షోభం మొదలైంది.  సరే ఓటములు సహజమే అనుకున్నా కూడా ఎన్నికలు ముగిసి ఏడాడి కాలం పూర్తైనా ఓటమిని సరిగ్గా సమీక్షించుకోవడం, లోపాల్ని సరిదిద్దుకోవడం లాంటి చర్యలేవీ కనబడలేదు అధిష్టానంలో.  మొన్నామధ్య మహానాడు నిర్వహించినా ఫలితం శూన్యం.  అధికార పక్షం జగన్ న్యాయకత్వంలో దూసుకుపోతుంటే బాబు సారథ్యంలో టీడీపీ వైకాపాను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైంది. 
 
దీంతో పార్టీలో న్యాయకత్వ మార్పు అవసరమనే ఆలోచన అందరిలోనూ మొదలైంది.  అయితే బాబు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు పట్టుకుంటారు అనే ప్రశ్నకు రెడీమేడ్ సమాధానం నారా లోకేష్.  చంద్రబాబు బాధ్యతల నుండి తప్పుకోవడం అంటూ జరిగితే ఆయన ఆయన స్థానంలో కుమారుడినే కూర్చోబెడతారు.  అది తథ్యం.  మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి పగ్గాలు అందుకుంటేనే టీడీపీ బ్రతుకుతుందని కొందరు అంటున్నారు. 
 
ఎన్టీఆర్ కు పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే స్టామినా ఉందా లేదా అనేది తర్వాత సంగతి.  అసలు ఆయన పార్టీలోకి వస్తారా, వస్తే ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ప్రధానమైన ప్రశ్న.  ప్రజెంట్ టీడీపీలో ఎన్టీఆర్ న్యాయకత్వం కోసం పరితపించిపోతున్న నాయకులు ఎవరూ లేరు.  ఉన్న సీనియర్లు అందరూ బాబుగారికి వీర విధేయులే.  వారెలాగూ లోకేష్ బాబును తమ భవిష్యత్ నాయకుడిగా అంగీకరించేశారు.  బాబు ఉన్నంతవరకు లోకేష్ స్థానానికి ఎలాంటి పోటీ, ప్రమాదం రాకుండా చూసుకుంటారు. 
 
బాలకృష్ణ సైతం తన అల్లుడు లోకేష్ చేతికే పగ్గాలని తేల్చి చెప్పారు.  ఇలాంటి పరిస్థితుల్లో తారక్ పార్టీలోకి రావాలని అనుకోరు.  ఆయనకు చంద్రబాబు నైజం ఎలాంటిదో అనుభవపూర్వకమే.  అయినా తాతాగారి పార్టీ కాబట్టి హక్కుందని మాత్రం దిగితే ఆయన పరిస్థితి ప్రజెంట్ బాలకృష్ణ పరిస్థితిలానే ఉంటుందనడంలో సందేహం లేదు. బాలయ్య పేరుకి టీడీపీకి నిజమైన వారసుడే అయినా చంద్రబాబు న్యాయకత్వంలోనే పనిచేస్తున్నారు.  ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎమ్మెల్యేగా గెలవగల సత్తా ఉన్న ఆయనకు కనీసం పార్టీలో నెంబర్ 2 అనే పేరు కూడా లేదు.  
 
ఇప్పుడు బావగారికి ఎలా సపోర్ట్ చేస్తున్నారో రేపు అల్లుడు లోకేష్ నారాకు అలాగే మద్దతిస్తారు.  అంతేగానీ ఎన్టీఆర్ చేతికి అధికారం ఇస్తే బాగుంటుందని, పార్టీ ముందుకెళుతుందని ఆలోచించి అల్లుడిని కాదని అన్న కొడుకుని భుజానికెత్తుకోరు కదా.  చంద్రబాబు, బాలయ్య ఉన్నంత వరకు లోకేష్ పూర్తిగా సేఫ్.  ఇక పార్టీలో ఎన్టీఆర్ కోసం తిరుగుబాటు జరుగుతుందా అంటే అది కలే.  కాబట్టి ఈ పరిస్థితుల నడుమ పార్టీలోకి వెళితే ఇప్పుడు బాలయ్య తన బావ చంద్రబాబుకి ఎలా సపోర్ట్ చేస్తూ వెనక నిలబడిపోయారో అలాగే ఎన్టీఆర్ కూడా తన బావ లోకేష్ కి సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యేగానో, మంత్రిగానో మిగిలిపోవాల్సి ఉంటుంది.