తెలుగు రాజకీయాల్లో స్థిరపడటానికి చాలాకాలం నుండి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో జతకట్టి స్థానిక పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలాగే వైసీపీపై ప్రజల్లో మతపరమైన కల్లోలాన్ని తీసుకురావడంలో బీజేపీ నేతలు ఏపీలో విజయం సాధించారు. అలాగే ఇప్పుడు తెలంగాణలోనూ బీజేపీ స్థిరపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ బీజేపీ అధినేత బండి సంజయ్ కూడా అధికార పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తెరాసకు చెక్ పెట్టనున్న బీజేపీ
దుబ్బాక ఎన్నికల తరువాత బీజేపీ నేతల్లో చాలా జోష్ కనిపిస్తుంది. అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవకపోవచ్చు కానీ తెరాస మెజారిటీని మాత్రం దెబ్బతియ్యడంలో బీజేపీ సఫలమైంది. అలాగే తమ పార్టీ యొక్క బలమెంటో కాంగ్రెస్, తెరాస నేతలకు చుపించారు, ప్రజల్లో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో రానున్న రోజుల్లో తెరాసకు చెక్ పెట్టడానికి బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటి తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా ఎదగడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జనసేన సపోర్ట్ ఎలాగో ఉంది కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించిన బీజేపీ
ఆపరేషన్ ఆకర్ష్ ను చెయ్యడంలో బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో మరింత స్థిరపడటానికి, రానున్న రోజుల్లో అధికారం చేపట్టడానికి బీజేపీ నాయకులు ఇప్పుడు ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులను పార్టీలో చేర్చికోవడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణలో విజయశాంతిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు రేవంత్ రెడ్డిపై కూడా బీజేపీ నేతలు కన్నువేశారు. అలాగే కొంతమంది తెరాస నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించడానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. తెరాస కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ ఆపరేషన్ ఆకర్ష్ లో బీజేపీ సఫలమైతే రానున్న రోజుల్లో తెరాసకు ఇబ్బందులు తప్పవు.