ఆరోపణలు సాయిరెడ్డిగారి మీదైతే పోలీసులేమో టీడీపీ నేత ఇంటికి వెళ్లారు 

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్టులు, అయ్యన్నపాత్రుడి మీద నిర్భయ కేసు వంటి వరుస ఘటనలతో అధికార వైసీపీ తమ మీద కక్షతోనే అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తోందని టీడీపీ పెద్ద ఎత్తున రగడ చేస్తోంది.  చంద్రబాబు మొదలుకుని కిందిస్థాయి లీడ్లర్ల వరకు అందరూ ఈ ఒక్క మాట మీదే పోరాడుతున్నారు.  తాజాగా పోలీసులు తీసుకున్న చర్యలు ఈ ఆరోపణలకు ఆద్యం పోసేలా ఉన్నాయి.  టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటి వద్ద పోలీసులు మోహరించడంతో తెలుగు దేశం నేతలు గగ్గోలు పెడుతున్నారు. 
 
నిన్న పట్టాభిరామ్ మీడియా మీట్ నిర్వహించి వైసీపీ కీలక నేత, వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి మీద 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్ట్ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు.  మొత్తం 307 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆధారాల పేరుతో పత్రాలను మీడియా ముందుంచారు.  గత ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణకు ఒక్కో అంబులెన్సుకు నెలకు 1.31 లక్షల చొప్పున బీవీజీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది.  కానీ వైసీపీ అధికారంలోకి రాగానే ఆ కాంట్రాక్టును రద్దు చేసి కొత్త అంబులెన్సుకు నెలకు 1.78 లక్షలు, పాతవి ఒక్కోక అంబులెన్సుకు నెలకు 2.21 లక్షలు చెల్లిస్తూ అరబిందో ఫార్మా ఫౌండేషన్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.  పాత ప్రభుత్వం ఒప్పందంతో పోలిస్తే ఈ కొత్త ఒప్పందం ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. 
 
పైగా బీవీజీ కాంట్రాక్ట్ 2020 డిసెంబర్ వరకూ ఉన్నా ఈలోపే అరబిందో ఫార్మా ఫౌండేషన్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  అల్లుడికి లబ్ది చేకూర్చడం కోసమే విజయసాయి ఈ అక్రమ కాంట్రాక్ట్ కుదిర్చారని పట్టాభిరామ్ ఆరోపణలు చేశారు.  అయితే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్‌ని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్టు టాక్.  తనపై పోలీస్ నిఘా ఎక్కువైందని, విజయసాయిరెడ్డి అవినీతిపై ఆధారాలు చూపిస్తే పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లాలి కానీ నా ఇంటి దగ్గరకు వస్తారనుకోలేదని, ఇది రాజారెడ్డి రాజ్యాంగంలా ఉందని అన్నారు.