తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను). ఇటీవల ఒరిస్సాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్‌ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్‌చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుండగా, అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ జె గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ప్రధాన తారాగణం. మధు బాబును దర్శకుడుగా పరిచయం చేస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ఒక నిమిషం 46 సెకనుల నిడివిగల ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
‘‘మా తండ్రి సివిల్ కాంట్రాక్టర్. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. దాంతో సినిమాలలో నటించాలనే బలమైన కోరిక ఉండడంతో రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ తరువాత ‘చెక్’, రాంగోపాల్ వర్మగారి ‘కొండా’సినిమాలో నక్సలైట్ నాయకుడు ఆర్.కె. పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువచ్చింది.
దర్శకుడు మధుబాబు చెప్పిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ కథ నచ్చడంతో ఈ సినిమాను నేనే నిర్మించాలని డిసైడ్ అయ్యాను. సోలో హీరోగా ఇది మొదటి సినిమా. మనిషి ఆయుష్షు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ‘‘మనిషి పుట్టిన మరు క్షణం నుంచే ఆ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తుంటుంది’’ అనే డైలాగ్ సినిమా సోల్ ఏంటో తెలుపుతోంది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ సాగుతుంది. ఇలాంటి కంటెంట్ ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు రాలేదని చెప్పవచ్చు. రిలీజియన్ మీద ఈ కథ ఉన్నందున సెన్సార్ వారు మొదట అభ్యంతరం వ్యక్తం చేసి, రివిజన్ కమిటీకి పంపారు. తరువాత వారు సినిమా చూసి ఓకే చెప్పడం జరిగింది. దాంతో సెన్సార్ వారు సైతం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తూ చాలా బాగా తీశావని ‘యు’ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.
ఇది టైం ట్రావెల్స్ మీద జరుగుతున్న కథ. ఈ కథలో ఐదుగురు ప్రొఫెసర్స్ ఉంటారు. వీరు.. నేను ఎక్కడెక్కడ ట్రావెల్ అయిన ప్లేస్‌ల గురించి క్వశ్చన్స్ అడుగుతారు. కథ చాలా ఇంట్రెస్ట్‌గా సాగుతుంది. దర్శకుడు మధు కెనడాలో వున్నా ఇండియాలో వచ్చి స్థిర పడ్డాడు. కొత్తవాడైనా కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ వెరీ రిస్కి అయినా డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడు చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించాడు. కథ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది.
ఇందులో బోల్డ్ కంటెంట్ ఉండదు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న కథ అయినందున రిస్క్ అయినా ఈ కథను సెలక్ట్ చేసుకొని సినిమా తీయడం జరిగింది. అలాగే ‘కొండా’ సినిమాలో ప్రొడక్షన్ సైడ్ కూడా వర్క్ చేయడం వల్ల ఆర్జీవీ గారి దగ్గర చాలా నేర్చుకొన్నాను. దాంతో నాకు ఈ సినిమా చెయ్యడానికి ఈజీ అయ్యింది. కొండా మురళి గారు నాకు గురువుతో సమానం. ఆయన నుంచి పరిస్థితులు ఎలా ఉన్నా మనం నమ్మిన దాని కోసం ముందుకు పోవాల్సిందే అనే ధైర్యాని నేర్చుకున్నాను.
మనతో ఉన్నటువంటి మనిషి మాయమైతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే టాలీవుడ్ తరుపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేటర్స్‌లో వచ్చే కలెక్షన్స్‌లో థియేటర్ ఖర్చులు పోను మిగిలిన ప్రతి రూపాయి ఒరిస్సాలో జరిగిన రైలు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సహాయం అందించడం జరుగుతుంది. ఇందు కోసమే ఈ సినిమాను ఈనెల 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్స్ వున్నాయి. వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.
దయచేసి అందరూ థియేటర్స్‌లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు.