ఒడిశా రైలు దుర్ఘటనకు ఇదే కారణం… సీబీఐ కీలక వ్యాఖ్యలు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్న సీబీఐ… తాజాగా కీలక విషయాలు వెల్లడించింది. ఈ దుర్ఘటనకు అసలు కారణాలు వివరించింది. ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయస్థానానికి కీలక విషయాలు వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన జరగడానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. పట్టాలపై అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అని సీబీఐ వెల్లడించింది. దీనికి సిగ్నల్ ఇన్ ఛార్జ్ చేసిన తప్పులే కారణం అని తెలిపింది.

సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌ ఇన్‌ ఛార్జి) అరుణ్‌ కుమార్‌ మహంత.. ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ ఈ విషయాలు సవివరంగా వివరించింది.

ఇందులో భాగంగా.. బహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్‌ లెవెల్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు ఈయన సమక్షంలోనే జరిగాయని కోర్టుకు సీబీఐ వివరించింది. దీనికోసం ఆయన సీనియర్‌ డివిజినల్‌ ఇంజినీర్‌ నుంచి అనుమతులు గానీ, సర్క్యూట్‌ గ్రాఫ్ గానీ తీసుకోలేదని తెలిపింది.

ఇదే సమయంలో… పనులు జరుగుతున్నప్పుడు మహంత అక్కడే ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే మరమ్మతులు జరిగాయని, గేట్‌ నెంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్‌ చిత్రం ఆధారంగా ఇక్కడ మరమ్మతులు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ న్యాయస్థానానికి వివరించింది.

ఈ రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకరైన అరుణ్‌ కుమార్‌ మహంత.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ భువనేశ్వర్‌ లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. అయితే దీనిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది.

మరోవైపు… ప్రమాదానికి కారణంగా భావిస్తున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ గత కొంత కాలంగా సరిగా పని చేయడం లేదని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని మహంత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

కాగా… జూన్‌ 2న ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ సందర్భంగా… కేంద్రం సిఫారసు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ముగ్గురిని అరెస్టు చేసింది.

అరెస్టయిన వారిలో సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌ ఇన్ చార్జ్) అరుణ్‌ కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌ లు ఉన్నారు.