దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతోపాటు.. దేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద ప్రమాధంగా చరిత్రకెక్కిన ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తులో సీబీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా… ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది.
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వీరిపై సీఆర్సీసీ 304, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురూ నిర్లక్ష్యం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని సీబీఐ బలంగా ఆరోపిస్తుంది!
వీరు ముగ్గురూ ప్రమాదానికి కారకులు అవ్వడంతో పాటు నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను ధ్వంసం చేశారనే అభియోగాలను సీబీఐ నమోదు చేసినట్లు సమాచారం. తమ నిర్లక్ష్యం పెను ప్రమాదానికి దారి తీస్తుందనే అవగాహన ఆ ముగ్గురికి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారని సీబీఐ తన నివేదికలో పేర్కొందని తెలుస్తుంది.
ఈ విషయంలో ఈ ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగే కారణమని ఇటీవల రైల్వే భద్రతా కమిషనర్ (సీ.ఆర్.ఎస్.) దర్యాప్తు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా… ముఖ్యంగా సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు సరైన విధంగా స్పందించకపోవడం వల్లే ఈ రైలు ప్రమాదం జరిగినట్లు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నివేదిక రూపొందించింది.
జూన్ 2 రాత్రి 7 గంటల ప్రాంతంలో బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఈ రైలు ప్రమాదంలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోందన్న సంగతీ తెలిసిందే. అయితే ఈ ప్రమదానికి కుట్ర కారణం కాదు నిర్లక్ష్యమే కారణం అని సీబీఐ తాజాగా తెలిపింది.
కాగా… జూన్ 2న రాత్రి 7 గంటలకు ఒడిశా బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ రైల్వేస్టేషన్ వద్ద కేవలం 15 నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేంది. ఈ దుర్ఘటనలో సుమారు 293 మంది మృతి చెందగా.. 1000 మందికిపైగా గాయపడ్డారు.
అయితే ఈ ఘటనకు నైతిక బధ్యత వహిస్తూ రైల్వేమంత్రి రాజినామాకు విపక్షాలు డిమాండ్ చేయగా… ఆయన సీబీఐ ఎంక్వైరీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.